Where Is Humanity : మానవత్వమా నువ్వెక్కడ…?-wife and daughter killed in tragic road accident in nallamala forest on sivaratri ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Wife And Daughter Killed In Tragic Road Accident In Nallamala Forest On Sivaratri

Where Is Humanity : మానవత్వమా నువ్వెక్కడ…?

HT Telugu Desk HT Telugu
Feb 20, 2023 08:18 AM IST

Where Is Humanity రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబానికి సకాలంలో వైద్యం అందక తల్లి, బిడ్డలు మృతి చెందిన ఘటన నల్లమల ఘాట్‌ రోడ్‌లో జరిగింది. గాయపడిన వారిని కాపాడాలంటూ బాధితుడు వేడుకున్నా ఆ మార్గంలో ప్రయాణించే వారు ఎవరు స్పందించకపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

భార్యా, కూతుళ్ల మృతదేహాలతో జంబులయ్య
భార్యా, కూతుళ్ల మృతదేహాలతో జంబులయ్య

Where Is Humanity రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకునే వారు కరువవ్వడంతో రెండు నిండు ప్రాణాలు నిస్సహాయంగా ప్రాణాలు విడవాల్సి వచ్చింది. నల్లమల అడవిలో జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘోరం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పసి బిడ్డను కాపాడేందుకు తండ్రి చేసిన ప్రయత్నాలు అరణ్య రోదనగా మిగిలాాయి. ప్రమాదంలో భార్య విగత జీవిగా మారడం, తీవ్ర గాయాలై విలపిస్తూ కాపాడాలని వేడుకున్నా ఆ దారిన వెళ్లే వాహనదారులెవరూ కనికరించలేదు.

రక్తమోడుతున్న పసిపాపను ఆస్పత్రిలో చేర్చాలనే ఆర్తనాదాలు ఒక్కరిని కూడా కదిలించలేకపోయాయి. చివరకు ఓ కారు యజమాని స్పందించి ఆస్పత్రికి తరలించినా, అప్పటికే ఆలస్యమైపోవడంతో పసిపాప ప్రాణాలు విడిచింది. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన జంబులయ్య, మైమ దంపతులు. వీరికి ఏడాదిన్నర వయసుఉన్న సరిత, సాత్విక అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెకు చికిత్స చేయించేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై మైమ స్వస్థలమైన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నల్లగట్టకు బయల్దేరారు. నల్లమల అరణ్యంలో ఆత్మకూరు మండలం బైర్లూటి దాటిన తర్వాత వేగంగా వచ్చిన ఓ జీపు వీరి వాహనాన్ని దాటుకుని వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో జీపు వేగం హఠాత్తుగా తగ్గించడంతో బైక్‌ అదుపుతప్పి పడిపోయింది.

బైక్‌ కింద పడటంతో మైమ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి సాత్విక ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడటంతో పాపను కాపాడుకునేందుకు జంబులయ్య అటుగా వచ్చిన ప్రతి వాహనాన్నీ ఆపేందుకు ప్రయత్నించారు. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వైపు వేల వాహనాలు వెళ్తున్నా, ఒక్కరు కూడా క్షతగాత్రులపై కనికరించలేదు.

చివరికి శ్రీశైలం నుంచి ఎమ్మిగనూరు వెళుతున్న శ్రీనివాస నాయుడు తన కారు ఆపి, మైమ మృతదేహంతో పాటు ముగ్గురినీ ఎక్కించుకున్నారు. బాధితులను ఆత్మకూరు వైద్యశాలకు చేర్చగా, అప్పటికే సాత్విక మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సకాలంలో ఆసుపత్రికి చేరుకుని ఉంటే తన కుమార్తె బతికేదని జంబులయ్య రోదించారు. భగవంతుడి అనుగ్రహం కోసం శ్రీశైలంబారులు తీరిన వేల వాహనాల్లో ఒక్కరైనా సకాలంలో స్పందించి ఉంటే చిన్నారి ప్రాణాలతో ఉండేదని బాధితుడు వాపోయాడు.

IPL_Entry_Point

టాపిక్