Sana Satish : ఎవరీ సానా సతీష్.. ఆయన్ను టీడీపీ రాజ్యసభకు ఎందుకు పంపింది.. ముఖ్యమైన 10 అంశాలివే
Sana Satish : ఇప్పుడు రాష్ట్రంలోని ఎక్కడ చూసినా సానా సతీష్ పేరే వినబడుతోంది. టీడీపీలోనూ, రాష్ట్రంలోనూ ఈయనెవరనే చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి. కీలకమైన రాజ్యసభకు టీడీపీ ఈయనను పంపడమే అందుకు కారణం. ఆయన గురించి ఆసక్తికరమైన 10 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టీడీపీలో రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై చంద్రబాబు చాలా ఆలోచన చేస్తారు. పార్టీకి సేవలందించిన వారిని ఎంపిక చేస్తారు. సీనియర్లను రాజ్యసభకు పంపుతారనే ముద్ర చంద్రబాబుపై ఉంది. కానీ ఇప్పుడు సానా సతీష్‌ను రాజ్యసభకు పంపడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీడీపీలో ఆయనేమీ పేరు మోసిన నేత కాదు. టీడీపీలో చాలా మందికి ఆయనెవరో తెలియదు. కానీ రాజ్యసభ ఎంపీ పదవీ కట్టబెట్టడంతో ఇప్పుడు టీడీపీలో రచ్చ మొదలైంది.
సానా సతీష్ గురించి ముఖ్యాంశాలు..
1. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామానికి చెందిన సానా సతీష్ బాబు.. 1972 ఆగస్టు 19న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సానా సుబ్బారావు, సత్యప్రభ, ఆయన భార్య నాగజ్యోతి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సానా సతీష్ పాలిటెక్నిక్ డిప్లొమా చేశారు. సతీష్ చదువుకుంటున్న రోజుల్లో అండర్-15 కాకినాడ క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వహించారు.
2. తండ్రి సుబ్బారావు విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పని చేసేవారు. ఆయన మరణించడంతో 1994 కారుణ్య నియామకాల్లో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చేరారు. ఆ తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అయ్యారు. అందులో ఏవో అవకతవకలు చేయడంతో ఆయన సస్పెండ్ కూడా అయ్యారని తెలిసింది. కొన్ని రోజులకు మళ్లీ ఉద్యోగంలో చేశారు. ఏఈగా పని చేస్తూ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాడు. పదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయనకు సొంత కారు కూడా లేదంటా. కాకపోతే మూడు కోట్లు విలువైన కార్లు ఆయన భార్య పేరు మీద ఉన్నయంటా. ఇది ఆయన తన అఫిడవిట్లో పెట్టారు.
3. ఆ తరువాత ఉన్న వ్యక్తుల పరిచయాలతో 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు మకం మార్చారు. అక్కడ ప్రముఖ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ వంటి ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలతో.. ఆలిండియా క్రికెట్ అసోసియేషన్ మ్యూజియం కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. మందలో ఒకడిగా కాదు. వందలో ఒకడిగా నిలవాలనేది ఆయన ఫిలాసఫీ. ఇది ఆయనే తన బయో వీడియోలో చెప్పుకున్నారు. అలాగే పరిచయాలు పెరగడంతో తన వ్యాపారాలను కూడా విస్తరించారు.
4. ఆయన రియల్ ఎస్టేట్, ఫుడ్ అండ్ బేవరేజ్, ఐటీ, పవర్ అండ్ ఎనర్జీ, సీ పోర్టు రంగాల్లోని అనేక కంపెనీల్లో భాగస్వామిగా చేరాడు. మెడాలన్, వాన్‌పిక్ సీపోర్టు, మహాకల్ప ఇన్‌ఫ్రా, మాట్రిక్స్ నేచురల్ రిసోర్స్ వంటి దాదాపు 14 కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు.
5. లంచం, మనీ లాండరింగ్ హవాలా కేసులను ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మీట్ వ్యాపారి మొయిన్ ఖురేషితో మనీలాండరింగ్ కేసులో సతీష్ సహా నిందితుడిగా ఉన్నారు. ఖురేషితో కలిసి అక్రమ వ్యాపారాలు కూడా చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే తనపై ఉన్న మనీ లాండరింగ్ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఖురేషి ద్వారా సీబీఐ అధికారులకు సతీష్ లంచం ఇచ్చినట్లు స్పష్టమైంది.
6.తనను కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ అత్యున్నత అధికారిగా ఉన్న రాకేష్ అస్తానా.. మధ్యవర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగారంటూ చేసిన ఆరోపణ సీబీఐని ఓ కుదుపు కుదిపేసింది. ఆ సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా పని చేసిన రాకేష్ ఆస్థానా, మరో సీబీఐ అధికారి అలోక్ వర్మ మధ్య చిచ్చుపెట్టింది. ఈ వ్యవహారంలో సీబీఐ డీఎస్పీ అరెస్టు కూడా అయ్యారు. రాకేష్ ఆస్థానాకు రూ.3 కోట్లు లంచం ఇచ్చినట్లు స్పష్టం అవ్వడంతో ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మిగిలిన రూ.2 కోట్లు అలోక్ వర్మకు ఇచ్చినట్లు రాకేష్ ఆస్థానా పేర్కొన్నారు.
7. ఆయనపై మనీలాండరింగ్, హవాలా కేసులను ఈడీ, సీబీఐ నమోదు చేశాయి. 2019 జులై 26న ఈడీ ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. 14 రోజుల రిమాండ్‌కు పంపింది. తనపై ఉన్న ఆరోపణలను కొట్టివేయాలంటూ ఈ ఏడాది జులైలో సానా సతీష్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కోట్టేసింది. ఆయనను విచారించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈడీ కస్టడీలో 2019 ఆగస్టు 2న సానా సతీష్ కీలక విషయాలు వెల్లడించారు. దీంతో ఆయకు ఉన్న లింకులపై రాజకీయ నేత షబ్బీర్ అలీ, నగల వ్యాపారి సుఖేష్ గుప్తా, ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్, వ్యాపారవేత్త చాముండీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
8. సానా సతీష్ మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. లోకేష్ యువగళం పాదయాత్ర ఖర్చును చాలా వరకు సానా సతీష్ చూసుకున్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవిలో ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో కాకినాడ ఎంపీ టిక్కెట్టు ఆశించారు. అందుకనుగుణంగానే కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఫ్లెక్సీలు, పోస్టర్లు అతికించారు. కానీ ఆ సీటు జనసేనకు కేటాయించడంతో ఆయన పోటీ చేయలేకపోయారు. ఆ ఎన్నికల ముందే తొలిసారి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనేమీ టీడీపీలో సీనియర్ నేతఏమీ కాదు.
9. సానా సతీష్‌కు సామాజిక అంశం కలిసొచ్చింది. సానా సతీష్ కాపు సామాజిక వర్గం కాగా, ఆయన భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో ఆయనకు సామాజిక అంశం కూడా కలిసి రావడంతో రాజ్యసభ దక్కింది.
10. సానా సతీష్‌ను రాజ్యసభకు ఎంపిక చేయడంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నేతలెవ్వరూ బహిరంగంగా మాట్లాడకపోయినా.. లోలోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ క్యాడర్ బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. వైసీపీని ఎప్పుడూ ఈడీ, సీబీఐ కేసులంటూ వ్యతిరేకించిన, టీడీపీ ఇప్పుడు ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్న సానా సతీష్‌ను రాజ్యసభకు పంపించేంత ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీలోనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ఖర్చు భరించాడని, అదే ఆయనను రాజ్యసభకు పంపడానికి కారణమని అంటున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)