Insurance In Arogyasri: ఏపీ ఆరోగ్యశ్రీలో బీమా మోజు ఎందుకు..గతానుభవాలతో గుణపాఠాలు నేర్వలేదా?-why is there a craze for insurance in ap arogyasri havent we learned lessons from our experiences ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Insurance In Arogyasri: ఏపీ ఆరోగ్యశ్రీలో బీమా మోజు ఎందుకు..గతానుభవాలతో గుణపాఠాలు నేర్వలేదా?

Insurance In Arogyasri: ఏపీ ఆరోగ్యశ్రీలో బీమా మోజు ఎందుకు..గతానుభవాలతో గుణపాఠాలు నేర్వలేదా?

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 29, 2024 12:46 PM IST

Insurance In Arogyasri: ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశ్రీలో బీమా కంపెనీలను ప్రవేశపెట్టాలనే ఆలోచన వెనుక ఎవరి ఆసక్తులు ఉన్నాయనే సందేహం ఏపీలో చర్చ జరుగుతోంది. పేదలకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించే లక్ష్యంతో మొదలైన ఆరోగ్యశ్రీ సేవలు..బీమా సేవలకు చేరుతుండటం వెనుక ఏదో జరుగుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీ ఆరోగ్య శ్రీలో బీమా కంపెనీల సేవల వెనుక అంతరార్థం ఏమిటి?
ఏపీ ఆరోగ్య శ్రీలో బీమా కంపెనీల సేవల వెనుక అంతరార్థం ఏమిటి?

Insurance In Arogyasri: ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ సేవల్లో ఇన్సూరెన్స్‌ కంపెనీలను ప్రవేశపెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో 85-90శాతం మందికి తెల్ల రేషన్‌ కార్డులతో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. రూ.25లక్షల వరకు వైద్య చికిత్సల్ని ప్రభుత్వమే భరిస్తోంది. ప్రైవేట్‌ రంగంలో పన్ను చెల్లింపదారులు మినహా అర్హతలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఏదో రూపంలో వైద్యాన్ని ప్రభుత్వమే అందిస్తోంది.

yearly horoscope entry point

ఇలా ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సేవలు అందని వారిలో ప్రధానంగా పట్టణాల్లో ఉండే మధ్యతరగతి వర్గమే అధికంగా ఉంటుంది. పనిచేసే సంస్థలు అందించే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు, సొంతంగా కొనుగోలు చేసే పాలసీలతో బీమా రక్షణ పొందుతున్నారు.

ఇన్సూరెన్స్‌ పాలసీలతో ప్రయోజనం ఎంత?

సాధారణంగా ఇన్సూరెన్స్‌ పాలసీల్లో నూటికి 60శాతానికి మించి హెల్త్‌ పాలసీలను క్లియర్ చేయవు. ఏదో రూపంలో కొర్రీలు వేసి వాటిని రిజెక్ట్ చేయడమో, పెట్టిన బిల్లులకు రకరకాల కొర్రీలు వేసి కోతలు వేయడమూ చేస్తుంటాయి. బీమా కంపెనీలు కూడా లాభాల కోసం వ్యాపారం చేసే సంస్థలే కావడంతో పాలసీ చెల్లింపుల విషయంలో 60-65 శాతానికి మాత్రమే పరిమితం అవుతాయి. వాటి గరిష్ట పరిమితిని మించి చెల్లింపులు చేయవు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన సమయంలో స్టార్ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య శ్రీ సేవల్ని ప్రారంభించిన సమయంలో పేదలు పెద్ద ఎత్తున ఖరీదైన వైద్య చికిత్సల్ని ప్రైవేట్ ఆస్పత్రులో పొందడం మొదలైంది. ఈ క్రమంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్సూరెన్స్ సంస్థ బీమా క్లెయిమ్స్‌ సెటిల్‌ చేయడంలో అభ్యంతరాలు లేవనెత్తడంతో మొత్తం దరఖాస్తుల్లో సగం పెండింగ్‌లో ఉండిపోయేవి.

అయా వ్యాధులు, శస్త్ర చికిత్సలకు చేసిన ఖర్చును చెల్లించడానికి బీమా సంస్థ నిరాకరించడంతో తిరిగి ప్రభుత్వం చెల్లించేది. ఓ వైపు బీమా నిర్వహణ కోసం ముందస్తుగా అయా సంస్థలకు ప్రీమియం చెల్లించడంతో పాటు, బీమా సంస్థ తిరస్కరించిన క్లెయిమ్‌లను ప్రభుత్వం సొంత ఖర్చులతో సెటిల్ చేయాల్సి వచ్చేది. వెరసి ఆరోగ్య శాఖపై భారం రెట్టింపు అయ్యేది. ఇన్సూరెన్స్ కంపెనీకు ప్రీమియం రూపేణా ముందస్తుగా చెల్లించిన మొత్తంలో 50శాతం కూడా వైద్య సేవల రూపంలో ప్రజలకు అందేది కాదు.

అలా క్లియర్‌ కానీ 50శాతం బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం సిఎంఆర్‌ఎఫ్‌ రూపంలో ప్రజలకు చెల్లించేది. స్థూలంగా వైద్యం కోసం రుపాయి ఖర్చు చేస్తే రుపాయిన్నర ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చేది. ఇలా వేల కోట్లు వృధా అవుతున్నాయని గుర్తించడంతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులతో నేరుగా ఒప్పందాలు ప్రారంభించింది.

బడ్జెట్‌ నుంచి నేరుగా కేటాయింపులు...

బీమా సంస్థలతో ప్రభుత్వానికి, ప్రజలకు పెద్దగా మేలు జరగడం లేదని భావించి ప్రభుత్వమే ట్రస్టు ద్వారా వైద్య సేవల్ని అందించడం మొదలుపెట్టింది. ఇలా రెండు దశాబ్దాల్లో కోటి 47లక్షల కుటుంబాలు, నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చారు. ఇందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానికి స్పష్టమైన నిర్వచనం ఇప్పటికీ లేదు. విద్యా, వైద్యం అందరి ప్రాథమిక హక్కులు కావడంతో ప్రభుత్వం నుంచి వైద్య సాయం అందని వర్గాలకు కూడా దీనిని వర్తింపచేయాలనే డిమాండ్ ఉంది. కేవలం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న కారణంతో లక్షలాది మందికి ప్రభుత్వం వైద్యాన్ని నిరాకరిస్తోంది.

ఆరోగ్యశ్రీలో చికిత్సలు ఇన్సూరెన్స్‌లో సాధ్యమేనా?

ప్రస్తుతం ఏపీలో ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా దాదాపు 3247 రకాల వైద్య సేవల్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఇన్ని వ్యాధులు, శస్త్రచికిత్సలకు వైద్యం అందదు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వైద్య సేవల్ని ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా అందిస్తుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా ఆ షరతులకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చికిత్సలు అందించాల్సి వస్తోంది. ఇక్కడ కూడా లోపాయికారీగా ఓ సర్దుబాటును ప్రభుత్వం అనుమతిస్తోంది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణంగా 3రకాల వైద్య చికిత్సలు అందుతుంటాయి. ఏ,బీ,సీ క్యాటగిరీల్లో వైద్యం అందిస్తుంటారు. ఆరోగ్య శ్రీ రోగులకు సీ క్యాటగిరీలో వైద్యం అందించినా బీ క్యాటగిరీలో బిల్లులు పెడుతుంటాయి. ఆస్పత్రులు, ఆరోగ్య శ్రీ ట్రస్టు మధ్యలో ఉండే లోపాయికారీ ఒప్పందాలతో ఏళ్ల తరబడి ఈ దందా సాగిపోతుంది. ఏ ప్రైవేట్‌ ఆస్పత్రిలోనైనా ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ వార్డులను ప్రత్యేకంగా నిర్వహించడమే దీనికి నిదర్శనం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో తేడా లేకపోయినా ఆరోగ్య శ్రీ రోగులకు కల్పించే సేవలు మాత్రం నాసిరకంగానే ఉంటాయి. నాన్‌ ఏసీ బెడ్‌లు, ప్రత్యేకంగా జనరల్ వార్డుల్లోనే చికిత్సలు అందిస్తుంటారు.

బీమా రిజెక్ట్‌ చేస్తే ఏంచేస్తారు....

బీమా కంపెనీలతోనే నేరుగా ఆరోగ్య శ్రీ సేవల్ని అందిస్తే అవి రిజెక్ట్‌ చేసే క్లెయిమ్స్‌ మాటేమిటనే సందేహం కూడా ఉంది. వైసీపీ హయంలో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. అసంఘటిత రంగంలో కార్మికుల రక్షణ కోసం ప్రైవేట్ ఇన్సూరెన్స్‌ సంస్థలతో కలిసి ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ పాలసీ నిర్వహించింది. ఇందులో ఎవరైనా హఠాన్మరణం పాలైతే వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం, సహజమరణమైతే రూ.2లక్షలు, శాశ్వతవైకల్యానికి రూ.5లక్షలు చెల్లించేలా పాలసీని నిర్వహించారు. ఈ పథకంలో 60శాతం క్లెయిమ్స్‌ కూడా బీమా కంపెనీ సెటిల్‌ చేయలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పరిహారం చెల్లించింది. ఆ తర్వాత ఏపీ జనరల్ ఇన్సూరెన్స్‌ కంపెనీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి దిగింది. కానీ దీనికి ఐఆర్‌డిఏఅనుమతులు లభించకపోవడంతో 2023-24లో ఏపీజీఐసీ మూతబడింది. చివరకు కార్మిక శాఖ ఇన్సూరెన్స్ పథకం అటకెక్కింది.

ప్రభుత్వ ఆస్పత్రల్లో ఎందుకు అందవు...

ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు కాసుల వర్షం కురిసింది. అంతకు ముందు డబ్బున్న వారికి మాత్రమే వైద్యం అందితే ఆరోగ్య శ్రీ అండతో పేదలకు కూడా నాణ్యమైన వైద్యం అందింది. ప్రైవేట్‌ రంగంలో తీవ్రమైన పోటీ నేపథ్యంలో చిన్నా చితక ఆస్పత్రులు కూడా ఆరోగ్య శ్రీ నిర్ణయించిన ధరలతో నాణ్యమైన వైద్య సేవల్ని అందించడానికి ట్రస్టుతో ఒప్పందాలు చేసుకున్నాయి.

అదే సమయంలో ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం జిల్లాకో ప్రభుత్వాస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దలేకపోయాయి. అన్ని విభాగాలతో నాణ్యమైన వైద్య సేవల్ని ప్రభుత్వమే అందిస్తే ఆరోగ్య శ్రీ భారం కూడా గణనీయంగా తగ్గి ఉండేది. ప్రభుత్వ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించక పోవడం, నాణ్యమైన శస్త్రచికిత్సలు అందించ లేకపోవడం ప్రభుత్వాల వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. వైద్య రంగంలో ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నా అందులో కమిషన్లు, లాభాల వాటా వెదుక్కునే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఈ సమస్యకు ప్రధాన కారణం.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్క నగరంలో కూడా కార్పొరేట్ సూపర్‌ స్పెషాలిటీ స్థాయి ఆస్పత్రి లేదంటే నమ్మశక్యం కాదు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ఉన్న ఆస్పత్రులు కేవలం మల్టీ స్పెషాలటీ సేవల్ని అందించే ఆస్పత్రులు మాత్రమే . మరో విచిత్రం ఏమిటంటే హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హై డిపెండెన్సీ యూనిట్‌లో ఒక రోజు చికిత్సకు రూ.6500 వసూలు చేస్తే అదే సేవలకు విజయవాడలో రూ.11,500 వసూలు చేస్తున్నారు.

బీమా నిరాకరిస్తే ఆ బిల్లులు ఎవరు చెల్లించాలి...

బీమా కంపెనీల ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ సేవల్ని అందిస్తే బీమా క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి అయా సంస్థలు నిరాకరిస్తే ఆ బిల్లులు ఎవరు చెల్లించాలనే సందేహం అందరిలో ఉంది. ఆరోగ్యశ్రీ తొలినాళ్లలో జరిగిన పరిణామాలు, రెండేళ్ల క్రితం లేబర్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వమే మరో హెడ్‌ అకౌంట్‌ నుంచి వైద్య సేవల బిల్లులు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం