AP Ministers Issue: ఆ మంత్రులతో బాబుకు అన్నీ తల నొప్పులే…వాళ్ళతోనే సమస్య ఎందుకు? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్-why is chandrababu naidu having headaches with cabinet ministers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ministers Issue: ఆ మంత్రులతో బాబుకు అన్నీ తల నొప్పులే…వాళ్ళతోనే సమస్య ఎందుకు? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్

AP Ministers Issue: ఆ మంత్రులతో బాబుకు అన్నీ తల నొప్పులే…వాళ్ళతోనే సమస్య ఎందుకు? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 08, 2025 07:23 AM IST

AP Ministers Issue: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే కొందరు మంత్రుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలు, సొంత వ్యవహారాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనవసరమైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కూటమితో సర్దుబాట్ల కంటే మంత్రులో వ్యవహారాలే బాబుకు తలనొప్పిగా మారాయి.

మంత్రుల తీరుతో చంద్రబాబుకు తలనొప్పులు
మంత్రుల తీరుతో చంద్రబాబుకు తలనొప్పులు

AP Ministers Issue: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అర్నెల్లలోనే కొందరు మంత్రులతో ప్రభుత్వానికి తలనొప్పులు తప్పడం లేదు. పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధుల వంటి విషయాల్లో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే కొందరు మంత్రుల వ్యవహారాలకే జనంలో ఎక్కువ పబ్లిసిటీ లభించింది. ముఖ్యమంత్ర పదేపదే చెబుతున్నా వాటిని పట్టించుకోకుండా సాగిస్తున్న వ్యవహారాలతో చికాకులు తప్పడం లేదు.

yearly horoscope entry point

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం అంత సులువుగా ఏమి జరగలేదు. ఐదేళ్లు ప్రతి పక్షంలో సవాళ్లు, అవమానాలు, కష్టాలని అధిగమించి అధికారంలోకి వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు 53 రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఆర్నెల్ల లోనే ఈ విషయాలు మర్చిపోయినట్టు వ్యవహరిస్తున్నారు.

అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉండాలని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని ముఖ్య మంత్రి పదేపదే చెబుతున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. ఆర్నెల్లలోనే దాదాపు పది మందికి పైగా మంత్రుల పని తీరుపై తీవ్ర ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వారి పేర్లపైనే ఎందుకు చర్చ జరుగుతోందనే వాదన కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చిన వారంతా ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే కావడం మరో రకమైన చర్చకు కారణం అవుతోంది.

ఆ మంత్రుల అత్యుత్సాహం…

ఏపీ మంత్రుల్లో అందరి కంటే ముందు రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అందరికంటే ముందు వార్తల్లో నిలిచారు. మంత్రి భార్య ఎస్కార్ట్‌గా రాలేదని పోలీస్ అధికారిని దుర్భాషలాడటం చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత అదే బాటలో ఇతర మంత్రులు నడిచారు.

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలామంది తొలిసారి మంత్రి పదవుల్ని దక్కించుకున్న వారే ఉన్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు మంత్రి పదవులు ఇస్తే వారంతా సొంత వ్యవహారాల్లో తలమునకలయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులంతా అదే ఫాలో అవుతున్నారు. ఏదొక వివాదాన్ని తలకు ఎత్తుకుంటున్నారు.

రామ్ ప్రసాద్ రెడ్డి తర్వాత వాసం శెట్టి సుభాష్ వ్యవహార శైలిపై టీడీపీ అధినేత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీనియర్లను కాదని టీడీపీల వాసంశెట్టి సుభాష్‌కు అవకాశం కల్పించడంతో సొంత పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఆ తర్వాత మంత్రి పార్థ సారధి, హోంమంత్రి అనిత, రెవిన్యూ మంత్రి ఆనగాని సత్యప్రసాద్, సివిల్ సప్లైస్‌ మంత్రి నాదెండ్ల, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇలా ఒకరి తర్వాత ఒకరు కూటమి పార్టీల్లో నేతలు వార్తల్లో నిలిచారు.

అయా శాఖల్లో అవినీతి వ్యవహారాలపై పత్రికల్లో ప్రముఖంగా కథనాలు రావడమో, మంత్రులు సంబంధం లేని వ్యవహారాల్లో తల దూర్చి బొప్పి కట్టించుకోడమో జరిగాయి. కొన్ని శాఖల్లో మంత్రులు శృతి మించి సంపాదనపై పడ్డారనే ప్రచారం జరగడంతో ప్రభుత్వానికి ఆర్నెల్లలోనే బోలెడు అప్రతిష్టను మూటగట్టేలా చేసింది. పోస్టింగులు, ప్రమోషన్లలో కొందరు మంత్రులు గల్లాలు తెరవడం, ఆ విషయాలు బయటకు పొక్కడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేలా చేసింది.

అయితే మంత్రుల అవినీతి వ్యవహారాల్లో కొందరి పేర్లే ప్రముఖంగా బయట ప్రచారం జరగడం కూడా వ్యూహాత్మకమేనని భావన కూటమి పార్టీ నేతల్లో ఉంది. అయా పార్టీల్లో అంతర్గతంగా ఉన్న పరిస్థితులతో పాటు సమయం దాటిపోతే మళ్లీ అవకాశం వస్తుందో రాదోననే ఆందోళనతోనే మంత్రులు రెచ్చిపోతున్నారనే వాదన ఉంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో తాము చేసిన పొరపాట్లు, తప్పుల్ని కవర్ చేయడానికి కులం, సామాజిక కార్డులను తెరపైకి తీసుకురావడం కూడా అయా పార్టీలకు కొత్త చిక్కులకు కారణమవుతోంది. తాము మాత్రమే తప్పు చేస్తున్నామా, మిగతా వారు శుద్ధపూసలా తరహా చర్చలతో ప్రధానంగా టీడీపీ ఇరకాటంలో పడుతోంది. కీలక శాఖలు, బాధ్యతలన్నీ కొందరి చేతుల్లో ఉంటే నిధులు లేని, ప్రాధాన్యత శాఖలపై ప్రచారం ఏమిటని వాదిస్తున్నారు. దీంతో అటు ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావంతో పాటు కూటమి పార్టీల తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం