AP Budget 2025 : బడ్జెట్‌పై చంద్రబాబు ఫోకస్.. మూడు కొత్త పథకాలకు శ్రీకారం.. 9 ముఖ్యమైన అంశాలు
AP Budget 2025 : ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ కూర్పుపై ఫోకస్ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పథకాలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓవైపు ఆదాయం తగ్గింది. మరోవైపు సంక్షేమ పథకాల భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు కూటమి నేతలు చెబుతున్నారు. తాజాగా బడ్జెట్ కూర్పుపై సీఎం చంద్రబాబు.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
9 ముఖ్యమైన అంశాలు..
1.కూటమి ప్రభుత్వ ఏర్పడ్డాక.. తొలిసారి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. అటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు.. సీఎం చంద్రబాబు ఈ బడ్జెట్‌పై ఫోకస్ పెట్టారు.
2.సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను.. కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
3.కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీంతో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై చంద్రబాబు దృష్టి పెట్టారు.
4. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తోంది. ఇది కొంతమేర ఊరటనిస్తోంది. అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు.
5.ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీగా మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర, సాంఘీక సంక్షేమ శాఖమంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి ఫరూక్‌తో పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు.
6.హంద్రినివా, వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల వంశధారా, గాలేరు- నగరి తోపాటు.. ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రామానాయుడు కోరారు.
7.సాంఘీక సంక్షేమ శాఖకు సంబంధించి గత బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లు కేటాయించారు. ఈసారి మరికొంత పెంచాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కోరారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు గత బడ్జెట్‌లో రూ.4100 కోట్లు కేటాయించారు. గిరిజన సంక్షేమానికి రూ.రూ.4500 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో 10 శాతం మేర పెంచాలని మంత్రి సంధ్యారాణి కోరారు.
8.గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టిందని.. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నారు.
9.2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో నవంబర్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.