AP Politics : టీడీపీ- జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఆ ప్రచారం ఎందుకు జరుగుతోంది?.. 10 ముఖ్యమైన అంశాలు-why campaign going on that there is a rift between tdp and janasena 10 important points ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Politics : టీడీపీ- జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఆ ప్రచారం ఎందుకు జరుగుతోంది?.. 10 ముఖ్యమైన అంశాలు

AP Politics : టీడీపీ- జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఆ ప్రచారం ఎందుకు జరుగుతోంది?.. 10 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Jan 15, 2025 06:10 AM IST

AP Politics : జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కూటమి పార్టీల మధ్య చీలికకు కారణమైందనే రాజకీయ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్‌లోనే కాదు.. గతంలో జరిగిన ఘటనల్లోనూ పవన్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

ఏపీ రాజకీయాలు
ఏపీ రాజకీయాలు (X)

ఇటీవల దేశంలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా రాజకీయాలు ఊహించని టర్న్ తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది కూడా కాలేదు. అప్పుడే చీలిక వచ్చే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం గతంలో, తాజాగా పరిణామాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలేననే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి 10 కీలకమైన అంశాలు ఇలా ఉన్నాయి.

yearly horoscope entry point

1.ఈనెల 8న తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈఘటనపై టీడీపీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడు వైఖరిని ప్రదర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. తొక్కిసలాట జరగడానికి కారణం ఇదేనని వ్యాఖ్యానించారు. కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందుకు విరుద్ధంగా స్పందించారు. ఈ విషాదానికి కారణమైన వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

2.ఈ ఘటనపై ఆరాతీసిన ప్రభుత్వం.. అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఘటన జరిగినప్పుడు పర్యవేక్షించిన డీఎస్పీ రమణ కుమార్, టీటీడీ శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాల డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కూడా మరికొందరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక్కడితో వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు.

3.గతేడాది సెప్టెంబర్‌లో తిరుపతి లడ్డూ వివాదం జరిగింది, ఈ వివాదంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును ‘స్వచ్ఛమైన’ నెయ్యితో కలపడానికి అనుమతించారని టీడీపీ, జనసేన ఆరోపించాయి. కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ.. పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలు ధరించి 11 రోజుల దీక్ష చేశారు. సనాతన ధర్మాన్ని అణగదొక్కడానికి జగన్, నకిలీ లౌకిక శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు.

4. తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో కళ్యాణ్ మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే.. దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి సహా వేరే ఇతర టీడీపీ నాయకుల నుండి ఇలాంటి డిమాండ్లు రాలేదు.

5.కళ్యాణ్ డిమాండ్ గురించి అడిగినప్పుడు.. టీటీడీ ఛైర్మన్.. క్షమాపణ చెప్పడం వల్ల చనిపోయినవారు తిరిగి రారు. తాము బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాము.. ఎవరో క్షమాపణ కోరారని తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అసలు వివాదం ఇక్కడే మొదలైంది.

6.బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో.. జనసేన, బీజేపీ, సంఘ్ పరివార్ - టీడీపీ మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా యుద్ధం మొదలైంది. ఇది పెద్ద వివాదంగా మారకముందే.. టీడీపీ జాగ్రత్త పడింది. పవన్ డిమాండ్ చేసిన రెండు రోజుల తర్వాత.. బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఆయన గతంలో ధిక్కార వైఖరిని ప్రదర్శించినప్పటికీ.. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో క్షమాపణలు చెప్పారని ప్రచారం జరుగుతోంది.

7.ఈ మొత్తం ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయ విజేత అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి నిందను పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై విజయవంతంగా మోపారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

8.పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యూహాన్ని అనుసరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై స్పందిస్తూ.. డీజీపీ, హోంమంత్రిని విమర్శించారు. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత హోంమంత్రి తన విధులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతే.. తాను హోం మంత్రిత్వ శాఖను చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు.

9.సానుకూల పరిణామాలను పవన్ తన ఖాతాలో వేసుకుంటూ.. లోపాలను సమర్థవంతంగా టీడీపీ ఖాతాలోకి నెట్టేస్తున్నారనే రాజకీయ అభిప్రాయాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో.. సనాతన ధర్మ రక్షకుడిగా పవన్ తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు సంఘ్ పరివార్ పవన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

10.తాజా పరిణామాలతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో హిందూ ఓట్ల ఏకీకరకణ, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభావం పెరగడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో లోకష్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఓ ప్రముఖ మీడియాలో ‘ఉప ముఖ్యమంత్రి’ సాంకేతికంగా రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, కళ్యాణ్ మంత్రివర్గంలోని ఇతర మంత్రుల మాదిరిగానే ఉంటారనే కథనం వచ్చింది. దీనిపైనా జనసైనికులు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ టీడీపీ ఫైట్ జరుగుతుంటే.. జనసేనకు బీజేపీ, సంఘ్ పరివార్ మద్దతు ఇస్తున్నాయి. ఇందుకే కూటమిలో చీలిక వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

Whats_app_banner