Whatsapp Governace: ఏపీలో త్వరలో వాట్సాప్ గవర్నెన్స్, ప్రజల్లో అపోహలకు క్లారిటీ ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు
Whatsapp Governace: ఏపీలో త్వరలో వాట్సాప్ ద్వారా పౌరసేవల్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లను వాట్సాప్‌లోనే పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Whatsapp Governace: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు త్వరలోనే ప్రారంభించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పౌరులు పొందే సదుపాయం కల్పించాలన్నారు. అయితే ఈ సర్టిఫికెట్ల జారీ ద్వారా ఎలాంటి అపోహలకు విమర్శలకు తావివ్వకుండా పగడ్బంధీగా చేయాలన్నారు. ప్రజలకు సందేహ నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.

వేగంగా డేటా అనుసంధానం:
ప్రభుత్వంలోని అన్ని శాఖల డాటాను అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నట్లు ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ సీఎంకు తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ప్రతి గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలోని 40 శాఖలకు సంబంధించి వివిధ శాఖాధిపతులు, విభాగాధిపతుల వద్ద ఉన్న డేటాను సేకరించి అనుసంధానించనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ డేటాలో లేకుండా ఉన్న పౌరుల డేటాకు కూడా కొత్తగా సేకరించారు. ఆధార్ నమోదు చేసుకోని పౌరులను గుర్తించి వారిని వివరాలు కూడా సేకరించామన్నారు. 2024 సెప్టెంబరులో రాష్ట్రంలో మొత్తం 1,67,53,812 మంది హౌస్ హోల్డ్స్ ఉంటే ఆ సంఖ్య జనవరి 2025 నాటికి 1,69,63,228కి పెరిగిందని వివరించారు. అలాగే రాష్ట్ర జనాభా సెప్టెంబరు 2024కు 4,90,83,312 మంది ఉంటే, జనవరి 2025కి 5,12,45,147కు చేరిందన్నారు.
24 లక్షల మంది రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లారని అలాంటి వారి డేటాను కూడా సేకరించి వారికి స్థానికంగా అనుసంధానం చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 1.69 కోట్ల కుటుంబాలకు గాను, 1.39 కోట్ల కుటుంబాలను జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వానికి చెందిన సామాజిక ఆస్తుల జియో ట్యాగింగ్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందన్నారు. 12,996 పంచాయతీల్లో 12,723 పంచాయతీల నుంచి అక్కడి సామాజిక ఆస్తుల వివరాలు వచ్చాయని, వాటికి జియో ట్యాగింగ్ చేపట్టామన్నారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి కుంటుంబంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విరివిగా ఉపయోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, ఎక్కడైనా లోపాలున్నాయా... ఉంటే ఎందుకున్నాయి, దానికి పరిష్కార మార్గాలేమిటి అనేవి రియల్ టైమ్ లో విశ్లేషించాలన్నారు.
15 శాతం వృద్ధి సాధనే లక్ష్యం
15 నుంచి 20 శాతం మధ్య వృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలన్నీ పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖలు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుని పనితీరు మెరుగుపరచుకోవడం ద్వారా ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. గూగుల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ప్రభుత్వ శాఖలు ఆర్టీజీఎస్‌తో తమ డేటాను అనుసంధానం చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా విశ్లేషించి ఆయా ప్రభుత్వ శాఖల్లో అమలు చేయదగ్గ విషయాలను గూగుల్ సంస్థ సూచిస్తుందని తెలిపారు.
సంబంధిత కథనం