AP WhatsApp Governance : నేటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ - ప్రధానమైన 10 విషయాలు-whatsapp governance services will be available in ap from today know these key points ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Whatsapp Governance : నేటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ - ప్రధానమైన 10 విషయాలు

AP WhatsApp Governance : నేటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ - ప్రధానమైన 10 విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 30, 2025 07:14 AM IST

WhatsApp governance in AP : ఏపీ ప్రభుత్వం సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారిగానే ప్రభుత్వ పౌరసేవలను అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనుంది. ఇవాళ్టి నుంచే వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సంస్కరణ దిశగా అడుగులు వేసింది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్‌ గవర్నెన్స్‌ శ్రీకారం చుట్టనుంది. పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ఈ వ్యవస్థను తీసుకురానుంది. నేటి నుంచే ఈ సేవలను ప్రభుత్వం ప్రారంభించనుంది.

yearly horoscope entry point

వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తోంది. గతేడాది అక్టోబర్ 22న మెటా సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నది. ఈ క్రమంలోనే…. నేటి నుంచి తొలి దశలో మొత్తం 161 పౌరసేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ - 10 ముఖ్యమైన అంశాలు:

  1. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి (జనవరి 30, 2025) వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ వాట్సాప్ సేవలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు.
  2. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తోంది. గతేడాది అక్టోబర్ 22న మెటా సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది.
  3. దశల వారీగీ వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థను అమలు చేయనున్నారు. తొలి దశలో భాగంగా మొత్తం 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి వస్తాయి. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.
  4. ఈ సేవలు అందుబాటులోకి రావటంతో ధ్రువపత్రాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పుతుంది. చాలా సులభంగా ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
  5. దేవదాయ, ఇంధనం, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన 161 ప్రభుత్వ సేవలు జనవరి 30 నుంచి వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
  6. దేశంలోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రభుత్వం తెలిపింది.
  7. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమ సమస్యలపై వినతులు, ఫిర్యాదులు చేయవచ్చు. ప్రభుత్వ నెంబర్ కు మెసేజ్‌ చేస్తే, వెంటనే వారికి ఒక లింక్‌ పంపిస్తారు. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నెంబర్, అడ్రస్, సమస్యలను టైప్‌ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నెంబర్ ఇస్తారు. దీని ఆధారంగా వారి సమస్య పరిష్కారం ఎంత వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు.
  8. తమ ప్రాంతంలోని డ్రైనేజీ కాలవల లీకేజీలు, రహదారుల గుంతలు ఫొటోలు తీసి పంపవచ్చు. వాతావరణ కాలుష్యంపై వాట్సాప్ లో ఫిర్యాదులు చేయొచ్చు. ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, లబ్ధి గురించి వాట్సప్‌ నెంబర్ కు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు.
  9. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు వంటి సమాచారం ఈ సేవల ద్వారా తెలసుకోవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు.
  10. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్‌లో తెలుసుకోవచ్చు. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులను అధికారిక వాట్సాప్‌ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ట్రేడ్‌ లైసెన్సులు పొందవచ్చు. దేవాలయాల్లో దర్శన టికెట్లు, వసతి బుకింగ్, విరాళాలు పంపడం చేయవచ్చు.

Whats_app_banner