Pawan Kalyan: ఏపీలో శాంతిభద్రతల బాధ్యత సీఎందే … వేర్వేరుగా హోం, లా అండ్ ఆర్డర్‌ శాఖల బాధ్యతలు-what will be in the hands of the home minister powers with cm ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan: ఏపీలో శాంతిభద్రతల బాధ్యత సీఎందే … వేర్వేరుగా హోం, లా అండ్ ఆర్డర్‌ శాఖల బాధ్యతలు

Pawan Kalyan: ఏపీలో శాంతిభద్రతల బాధ్యత సీఎందే … వేర్వేరుగా హోం, లా అండ్ ఆర్డర్‌ శాఖల బాధ్యతలు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 05, 2024 08:07 AM IST

Pawan Kalyan: పోలీస్ శాఖ పనితీరుపై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ హోంమంత్రి నుంచి హోంశాఖ బాధ్యతలు తాను చేపట్టాల్సి ఉంటుందని పవన్ హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రికి ఉన్న అధికారాలు తెరపైకి వచ్చాయి.

గొల్లప్రోలు సభలో పవన్ కళ్యాణ్‌
గొల్లప్రోలు సభలో పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan: ఏపీలో పోలీసుల పనితీరును తప్పు పట్టే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు సభలో చేసిన వ్యాఖ్యలు ఏపీ హోంమంత్రికి ఉన్న అధికారాల పరిధిని లేవనెత్తాయి. ఏపీలో గత పదిహేనేళ్లుగా పేరుకు మహిళలకు హోంమంత్రి పదవుల్ని కట్టబెడుతున్నా అందులో అసలు అధికారాలు మాత్రం ముఖ్యమంత్రుల వద్దే ఉంటున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హోంమంత్రి అధికారాల పరిధి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఏం జరిగిందంటే…

ఏపీ హోంశాఖ పనితీరుపై డిప్యూటీ సిఎం సోమవారం గొల్లప్రోలు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇష్టమొచ్చినట్లు రౌడిల్లా వైసీపీ వ్యక్తులు వ్యవహరిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? అని హోంమంత్రి అనితను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? అని నిలదీశారు. మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించండి అంటూ సూచించారు.

'క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి. అత్యాచార నిందితుల అరెస్ట్‌కు కులం అడ్డువస్తోందా. క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది. అధికారులకు, ఎస్పీలకు చెబుతున్నా.. శాంతి భద్రతలు కీలకమైనవి. అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది' అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

'నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని. హోమ్ శాఖ మంత్రిని కాదు. పరిస్థితులు చెయ్యి దాటితే నేను హోమ్ శాఖ తీసుకుంటాను. నేను తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తరహాలో వ్యవరిస్తాను. డీజీపీ గత ప్రభుత్వంలా వ్యవహరించకూడదు. బాధ్యత తీసుకోండి. పాత పద్ధతులు పాటిస్తాం అంటే చూస్తూ ఊరుకోను. ప్రజలు ఇచ్చిన పదవి ఇది, వారికి రక్షణ కల్పించాలి.' అని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.

తనను అనలేదన్న అనిత…

హోంమంత్రిగా అనిత విఫలమయిందని పవన్‌ కల్యాణ్‌ అన్నట్లు చూపించాలని మంత్రి సవాలు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో పోలీస్‌ అధికారులతో సమీక్ష అనంతరం సోమవారం రాత్రి మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ‘పవన్‌ కల్యాణ్‌ బాధతో అన్న మాటలను వక్రీకరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని, కట్టు తప్పి ప్రవర్తిస్తున్న వారినీ అదుపులోకి తీసుకోవడంపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. అయినా అక్కడక్కడా పోలీసులు ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు. అది చూసి కడుపు మండి ఎవరైనా మాట్లాడతారని చెప్పారు.

రాజకీయం ముసుగులో నేరస్థులు చేసిన పనులకు పర్యవసానం చూస్తున్నామని చెప్పారు. తాను చేస్తున్న పనికి పవన్ మద్దతిచ్చినట్లయిందని మరింత తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారని వివరణ ఇచ్చారు. మరింతగా సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పిన దానిని పరిగణలోకి తీసుకుంటానని సోషల్‌ మీడియాకు తానూ బాధితురాలినేనని. పవన్‌ కల్యాణ్‌ బయటపడ్డారు నేను బయటపడలేదు అంతే అన్నారు.

వివాదం ఏమీ లేదు..

హోంశాఖను తాను తీసుకుంటానని పవన్‌ ఎక్కడా అనలేదని, ఆయన వ్యాఖ్యల్లో వివాదానికి తావేమీ లేదని పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. కొన్ని ఘటనల్లో న్యాయ, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఇబ్బందులు ఉండొచ్చని, దాని వల్ల కేసుల విచారణ ఆలస్యం కావచ్చన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరి మధ్యా పొరపొచ్చాలు లేవన్నారు.

అన్ని పార్టీలది అదే దారి…అధికారం రిమోట్ ఎక్కడో..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన హోంశాఖకు వరుసగా మూడోసారి మహిళను మంత్రిగా నియమించారు. ఏపీలో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వంలో వంగలపూడి అనితకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ శాఖను నిర్వహించిన వారు ఎవరు సొంత ముద్ర వేయలేకపోయారు. గత ఐదేళ్లలో దళిత మహిళలకు హోం శాఖ దక్కినా అధికారాన్ని మాత్రం మరో చోట ఉండేది.

ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుచరితకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. 2022 లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తానేటి వనిత హోంశాఖ బాధ్యతల్ని నిర్వహించారు. మూడోసారి కూడా మహిళకే హోంశాఖ బాధ్యతలు దక్కాయి.టీడీపీలో కీలకమైన మహిళా నాయకురాలు అనితకు హోంశాఖ బాధ్యతల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు. లా అండ్‌ ఆర్డర్ బాధ్యతలు మాత్రం ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉండనున్నాయి.

రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోం మంత్రి అంటే అత్యంత శక్తివంతమైన శాఖ అనే భావన ఉండేది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంశాఖను వైఎస్సార్ హయంలో సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. అప్పట్లో హోంశాఖ మీద ఇతరులకు పట్టు లేకుండా చేయడానికే మహిళకు బాధ్యతలు అప్పగించారనే విమర్శలు వచ్చాయి. పేరుకు సబితాను హోంమంత్రి చేసినా పెత్తనం మొత్తం వైఎస్‌ చేతుల్లో ఉంచుకోడానికే సబితకు హోంశాఖను అప్పగించారని కాంగ్రెస్‌ సీనియర్లు గుర్రుమన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వైఎస్సార్ మృతి చెందడంతో హోంశాఖ మొత్తం సబిత గుప్పెట్లోకి వచ్చింది. కిరణ్‌ హయంలో లా అండ్‌ ఆర్డర్ ఆయన వద్దే ఉండేది.

వైఎస్‌ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టిన రోశయ్య ప్రభుత్వంలో, ఆ తర్వాత వచ్చిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో సబిత తిరుగులేని అధికారాన్ని అనుభవించారు. సబిత అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె కుమారుడు చెలరేగిపోయారనే ఆరోపణలు వచ్చిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏమి చేయలేకపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెలకున్న రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో హోంశాఖ మీద పట్టు నిలుపుకున్న మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మొదట నాయిని నర్సింహారెడ్డి, తర్వాత మహమూద్‌ అలీ కూడా పేరుకే హోంమంత్రులుగా ముద్ర వేసుకున్నారు. అయితే పోలీస్ శాఖపై అధికారం మొత్తం కేసీఆర్ గుప్పెట్లో పెట్టుకున్నారు.

విభజన తర్వాత…

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్పకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు.టీడీపీ సీనియర్‌ నాయకుడు, సౌమ్యంగా ఉండే చినరాజప్పకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. పదవిలో ఉండగా సొంత నియోజక వర్గంలో సిఐలను కూడా బదిలీ చేయించుకోలేక పోయారనే విమర్శలు చినరాజప్పపై ఉండేవి. హోంశాఖ మంత్రిగా శాఖపై పట్టు కోసం ఎనాడు ఆయన పాకులాడలేదు.హోంశాఖ అధికారం మొత్తం మరో చోట కేంద్రీకృతమైందనే ప్రచారం ఉన్నా చివరి వరకు అలాగే సర్దుకుపోయారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేకతోటి సుచరితకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. పేరుకు మంత్రిగా సుచరిత ఉన్నా కనీస గౌరవానికి కూడా ఆమె నోచుకోలేదు. సిఐలు, ఎస్సైల బదిలీలు కూడా సజ్జల కనుసన్నల్లో జరిగేవి. ఓ దశలో సుచరిత అసమర్థురాలనే ప్రచారాన్ని వైసీపీ నాయకులే ప్రచారం చేశారు. హోంశాఖలో అధికారుల బదిలీలకు సుచరిత భర్త ప్రయత్నించారని, ప్రభుత్వ పెద్దలు మందలించారని కథనాలు తెరపైకి తెచ్చారు.

జాగిలాల శిక్షణకు అతిథిగా…

ఆ తర్వాత ఆమె స్థానంలో తానేటి వనితకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. హోంశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ శాఖపై సమీక్ష జోలికే వెళ్లని మంత్రిగా వనిత గుర్తింపు తెచ్చుకున్నారు. తీవ్రమైన నేరాలు, దారుణ ప్రమాదాలు జరిగినా అందరి కంటే ఆఖర్లో నింపాదిగా స్పందించేవారు. ఆ శాఖతో తనకు సంబంధం లేదు అంతా తాడేపల్లి నుంచి చూసుకుంటారన్నట్టు మంత్రిగా వనిత వ్యవహారం సాగేది. నియోజక వర్గంలో ప్రచారం చేసుకుంటే చాలన్నట్టు చివరి రోజు వరకు ఆమె పని తీరు సాగింది.

పోలీస్ జాగిలాల శిక్షణా కార్యక్రమాలకు మాత్రం తానేటి వనిత తప్పనిసరిగా ముఖ్య అతిథిగా హాజరయ్యేవారు. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి హోంమంత్రిని ఏనాడు ఖాతరు చేసిన దాఖలాలు లేవు. దళిత మంత్రి కావడంతో ఆమెపై చిన్నచూపు ఉండేదని, దళితులకు హోం శాఖ బాధ్యతల్ని అప్పగించామని ప్రచారం చేసుకున్నా అధికారాన్ని ఇవ్వలేదనే విషయం విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఎన్నికల్లో వనిత ఘోర పరాజయానికి కూడా ఇదొక కారణమైంది.

అనితకు అధికారం దక్కుతుందా?

టీడీపీ ప్రభుత్వంలో వంగలపూడి అనితకు హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఐదేళ్లు తీవ్ర నిర్బంధాలను, అవమానాలను వనిత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు గురయ్యారు. అసభ్య దూషణలు, అశ్లీల చిత్రాలతో ప్రత్యర్థులు ఆమెను ట్రోల్ చేశారు. ప్రస్తుతం హోంమంత్రి బాధ్యతల్ని వనితకు అప్పగించడంతో ఆమెకు డిపార్ట్‌మెంట్‌లో ఏ మేరకు అధికారం లభిస్తుందనే సందేహాలు కూడా ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంశాఖ మంత్రులకే సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది. పోలీస్ శాఖలో పోస్టింగుల్లో జోక్యం చేసుకోకుండా, రాజకీయ అవినీతికి తావు ఇవ్వకుండా ఉండటానికి ఇలా చేసేవారని పోలీస్ అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ బాధ్యతలు లేకుండా హోంమంత్రిగా ఉన్న వారు సిఐలను కూడా బదిలీ చేయ లేరని గుర్తు చేస్తున్నారు. అధికారం లేని హోంశాఖను పవన్ తీసుకుంటానని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో కాలమే చెప్పాలి.

Whats_app_banner