NTR Health University : పేరు మార్పుతో ప్రయోజనం ఏమిటి….సొంత క్యాంపస్ లేకుండా…?-what is use of name change of ntruhs to ysruhs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  What Is Use Of Name Change Of Ntruhs To Ysruhs

NTR Health University : పేరు మార్పుతో ప్రయోజనం ఏమిటి….సొంత క్యాంపస్ లేకుండా…?

HT Telugu Desk HT Telugu
Sep 23, 2022 12:14 PM IST

NTR Health University దేశంలోనే మొట్టమొదటి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైంది. అప్పటి వరకు సంప్రదాయ యూనివర్శిటీల్లో భాగమైన వైద్య విద్యకు ప్రత్యేక గుర్తింపు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన వైద్య విశ్వవిద్యాలయంతోనే మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ తర్వాత దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా వైద్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రారంభించాయి. విజయవాడ నగరానికి ఓ గుర్తింపు తీసుకురావడంలో ఈ యూనివర్శిటీ భాగస్వామ్యం కూడా ఉంది. తాజాగా యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారం రాజకీయ రగడగా మారింది.

విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్
విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

NTR Health University ఎన్టీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్పు వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. సాధారణంగా యూనివర్శిటీ అంటే వంద, రెండు వందల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. కానీ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ మాత్రం దాదాపు 40ఏళ్లుగా అద్దె భవనాల్లోనే ఉంటోంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రి భవనాలను అద్దెకు తీసుకుని యూనివర్శిటీ నడుపుతున్నారు. డబ్బులు లేకపోవడం దీనికి కారణం కాదు. మూడున్నర దశాబ్దాలుగా పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే అసలు సమస్య.

ట్రెండింగ్ వార్తలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా వ్యవస్థ మొత్తం హైదరాబాద్‌ కేంద్రంగానే ఉండటంతో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హెల్త్‌యూనివర్శిటీ ఏర్పాటు చేశారు. వైద్య విద్యను యూనివర్శిటీల పరిధి నుంచి తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను హెల్త్‌ యూనివర్శిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ఎంబిబిఎస్‌, పీజీ మెడికల్‌, బిడిఎస్‌, ఎండిఎస్‌, ఫిజియోథెరపీ, నర్సింగ్ వంటి కోర్సుల నిర్వహణ హెల్త్‌ యూనివర్శిటీ పరిధిలోకి వచ్చాయి. తొలినాళ్లలో విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కాలేజీ యూనివర్శిటీ పనిచేసేది. ఆ తర్వాత సిద్ధార్ధ కాలేజీ బోధనాసుపత్రి పరిధిలోకి వెళ్లిపోయింది. దీంతో యూనివర్శిటీ అస్తిత్వం లేకుండా పోయింది.

NTR Health University ఎన్టీఆర్‌ మరణం తర్వాత 1998లో హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఆ తర్వాత రాజశేఖర్‌ రెడ్డి హయంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీగా మార్చారు. ఏటా ఎంబిబిఎస్‌ కోర్సుల ప్రవేశాలు, కాలేజీలకు అనుమతులు, ఫీజుల వసూళ్లు, అడ్మిషన్లు, కౌన్సిలింగ్ నిర్వహణల ద్వారా నాలుగు దశాబ్దాల్లో దాదాపు రూ.400కోట్ల రుపాయలకు పైగా ఆదాయాన్ని యూనివర్శిటీ సంపాదించింది. గత ఏడాది ఆ డబ్బు మొత్తం ఏపీ ప్రభుత్వం బలవంతంగా యూనివర్శిటీ నుంచి లాగేసుకుంది.

మూడున్నర దశాబ్దాల్లో ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీకి ఓ సొంత క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీకి అకడమిక్ క్యాంపస్ ఏర్పాటు కోసం భూమిని కేటాయించాలనే ఆలోచన కూడా చేయలేదు. అప్పట్లో విసిగా పనిచేసిన ప్రొఫెసర్ రవికుమార్‌ పలుమార్లు ప్రభుత్వానికి భూకేటాయింపు చేయాలని కూడా లేఖలు రాశారు. రాజధాని ప్రాంతంలో భూమిని కేటాయిస్తే అన్ని ప్రమాణాలతో సొంత క్యాంపస్ నిర్మించుకుంటామని కొత్త అకడమిక్‌ విభాగాన్ని పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన లభించలేదు.

యూనివర్శిటీ వద్ద వందలకోట్ల రుపాయల నిధులు ఉన్నా వాటిని సద్వినియోగంచేసుకోడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో బ్యాంకుల్లో ఉండిపోయాయి. చివరకు గత ఏడాది ప్రభుత్వం వాటిని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ కాస్త డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్శిటీగా మారింది. ప్రభుత్వ నిర్ణయంతో రాజకీయ వివాదాలు ఎలా ఉన్నా, యూనివర్శిటీ ముఖచిత్రం మారే పరిస్థితి లేదు. అదే అద్దె భవనంలో కొనసాగనుంది.

చదువుకునే వారికే ఇబ్బందులు….

యూనివర్శిటీ పేరు మార్పుతో అందులో రకరకాల కోర్సులు చదువుతున్న వారికే ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త పేరును విదేశాల్లో గుర్తించడం ఇబ్బంది ఎదురవుతుంది. యూనివర్శిటీ పేరు మార్పుపై అన్ని దేశాలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి కొన్నేళ్ల పాటు ఈ కష్టాలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. గతంలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చినపుడు ఇలాంటి సమస్యలు తలెత్తాయని గుర్తు చేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్