Kartika Masam Vanabhojanalu : వనభోజనాల విశిష్టత ఏంటీ.. కార్తీక మాసంలోనే ఎందుకు వెళ్లాలి?-what is the speciality of karthika vanabhojanalu in ap and telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kartika Masam Vanabhojanalu : వనభోజనాల విశిష్టత ఏంటీ.. కార్తీక మాసంలోనే ఎందుకు వెళ్లాలి?

Kartika Masam Vanabhojanalu : వనభోజనాల విశిష్టత ఏంటీ.. కార్తీక మాసంలోనే ఎందుకు వెళ్లాలి?

Basani Shiva Kumar HT Telugu
Nov 02, 2024 01:02 PM IST

Kartika Masam Vanabhojanalu : కార్తీకమాసం వచ్చిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో వన భోజనాల సందడి ప్రారంభం అవుతుంది. అయితే.. కార్తీక మాసంలో వన భోజనాలకు ఎందుకు వెళ్లాలి.. దాని విశిష్టత ఏంటనేది చాలామందికి తెలియదు. కార్తీకమాసం వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఓసారి చూద్దాం.

వనభోజనాల విశిష్టత
వనభోజనాల విశిష్టత

వనము అంటే అనేక వృక్షాల సముదాయం. రావి, మర్రి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస వంటి వృక్షాలతోపాటు.. తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ, మొక్కలతో రకరకాల పూల మొక్కలతో ఉండాలి దాన్నే వనము అంటారు. దాహం వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి.

ఇవి ఉన్నచోట జింకలు, కుందేళ్లు, నెమళ్లు, చిలుకలు మొదలైన సాదు ప్రాణులు ఉంటాయి. దాన్నే వనము అంటారు. వనము అంటే నివసించడానికి అనువైన ప్రదేశం అని అర్థం. వేటకు, క్రూరత్వానికి తావులేనిది. ఆ వనాన్ని దేవతా స్వరూపం అంటారు. వృక్షాలు, మొక్కలు.. దేవతలకూ, మహర్షులకూ ప్రతిరూపాలు. అలాంటి వనాలను ఏడాదికి ఒక్కసారైనా దర్శించాలని మన పూర్వీకులు చెప్పేవారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలు ఉన్నాయి.

కార్తీకమాసం నాటికి.. వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమౌతాయి. చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. మనసుకు ఆనందాన్ని., ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ కార్తీకమాసం.

ఆధ్యాత్మికపరంగా శివ, కేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీకమాసం. అందుకే శివ, కేశవ భక్తులు ఒకచోట చేరి ఐకమత్యంతో, ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించేది ఈ కార్తీకమాసం.

పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు, చెట్లు పచ్చగా చిగుర్చి, పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేసేదే ఈ కార్తీకమాసం. అందుకే కార్తీకమాసంలో వనభోజనాలకు వెళ్లాలని పూర్వీకులు చెప్పేవారు.

అయితే.. ఇంత పుణ్యప్రదమైన ఈ కార్తీకమాసంలో వనవిహారం చేసిరండి అంటే ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ఆకలేస్తే ఏలా అని.. అందుకే వనభోజనాలు ఏర్పాటు చేసారు మన పెద్దలు. వనభోజనం అంటే, కేవలం తిని తిరగడమే కాదు. దానికో పద్ధతి, నియమం కూడా పెట్టారు.

సూర్యోదయానికి ముందే వనానికి చేరుకోవాలి. ఓ వృక్షం కింద దేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో అలంకరించాలి. సామూహికంగా కలసి చేసిన శాకాహార వంట పూర్తైన తర్వాత.. ఆ పదార్థాలను పూజా స్ధలానికి చేర్చి.. అందరూ కలిసి దేవతారాధన చేయాలి. ఆ ప్రసాదాన్ని వడ్డించుకొని తినాలి. ఆ తర్వాత ఆట పాటలకు అవకాశం ఇవ్వాలి. దీంతో బంధాలు బలపడతాయని పెద్దలు చెబుతుంటారు.

Whats_app_banner