TDP on Amaravati R5 Zone: ఆర్‌5 జోన్‌ వ్యవహారంలో టీడీపీ సైలెంట్..కారణం అదేనా?-what is the reason for tdps silence on amaravati r5 zone issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  What Is The Reason For Tdp's Silence On Amaravati R5 Zone Issue?

TDP on Amaravati R5 Zone: ఆర్‌5 జోన్‌ వ్యవహారంలో టీడీపీ సైలెంట్..కారణం అదేనా?

HT Telugu Desk HT Telugu
May 09, 2023 11:55 AM IST

TDP on Amaravati R5 Zone: రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చిన విడిచిపెట్టని తెలుగుదేశం పార్టీ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై మాత్రం మౌనం వహిస్తోంది.

అమరావతి ఆర్ 5 జోన్
అమరావతి ఆర్ 5 జోన్ (File Photo)

TDP on Amaravati R5 Zone: రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించిన ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెదవి విప్పడం లేదు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో రైతుల అభ్యంతరాలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్‌, గుంటూరుజిల్లాలకు చెందిన పలు నియోజక వర్గాల ప్రజలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు, ఐనవోలు, మందడం గ్రామాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 20 లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. ఈ నెల 15లోగా పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల లబ్ధిదారులకు అయిదు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పనులు చేపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 20వేల మందికి పైగా ఈ ప్రాంతంలో నివాస స్థలాలను కేటాయిస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇ‌ళ్ళ స్థలాలుకేటాయించడానికి మూడేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినా, రైతుల అభ్యంతరాలతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయి. సుదీర్ఘ విచారణ తర్వాత రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై రైతుల అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడి ఇళ్ల స్థలాల కేటాయింపు ఉంటుందని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ వ్యవహారంపై రాజధాని ప్రాంత రైతులు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. ఇళ్ల స్థలాల కేటాయింపును నిలుపుదల చేయాలని కోర్టును ఆశ్రయించారు. వచ్చే వారం రైతుల పిటిషన్ విచారణకు రానుంది.

టీడీపీ మౌనానికి కారణం ఏమిటి..?

ఆర్‌5 జోన్ వ్యవహారంపై టీడీపీ మౌనం వహిస్తోంది. ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తుంటే టీడీపీ నాయకులు మాత్రం ఈ వ్యవహారంతో తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణ విషయంలో రాజధాని ప్రాంత రైతుల వెన్నంటి నడిచిన తెలుగు దేశం పార్టీ, ఆర్‌5 జోన్ విషయంలో వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.

పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపును టీడీపీ వ్యతిరేకిస్తుందనే ప్రచారం ఆ పార్టీకి చేటు చేస్తుందనే అనుమానంతో టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు తర్వాత ఏపీ మంత్రులు పెద్ద ఎత్తున టీడీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడకుండా టీడీపీ వివాదాలు సృష్టిస్తోందని ఏపీ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

మరోవైపు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పేదలకు పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో కేటాయిస్తుండటం, రెండు జిల్లాల్లో ఏడెనిమిది నియోజక వర్గాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వం ఇంటి స‌్థలాలు కేటాయిస్తుండటంతో టీడీపీ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు ప్రజలకు లబ్ది కలిగించే పథకాలను వ్యతిరేకిస్తే, ప్రజల్లో తమపై వ్యతిరేకత రావొచ్చని భయపడుతోంది. వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల కేటాయింపుపై టీడీపీని తప్పు పడుతున్న తమకేమి సంబంధం లేనట్టు టీడీపీ మౌనం వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో లోపాలను ఎండగట్టడానికి పరిమితం కావాలని టీడీపీ భావిస్తోంది.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపును టీడీపీ వ్యతిరేకిస్తే, వైసీపీ చేసే విమర్శలు ఊతమిచ్చినట్టేనని టీడీపీ భావిస్తోంది. అమరావతి ప్రాంతం ఓ వర్గానికి సంబంధించిన ప్రాంతంగా వైసీపీ ఆరోపిస్తోంది. ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా అంగీకరించడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఇప్పుడు ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తే వైసీపీ ప్రచారాన్ని నిజం చేసిఃనట్లు అవుతుందనే ఉద్దేశంతోనే టీడీపీ సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.