Sachivalaya Staff Rationalization : రేషనలైజేషన్‌పై సచివాల‌య ఉద్యోగ సంఘాల అభిప్రాయ‌మేంటి? పది కీల‌క‌మైన అంశాలివే-what is the opinion of the secretariat employees unions on rationalization ten key points ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sachivalaya Staff Rationalization : రేషనలైజేషన్‌పై సచివాల‌య ఉద్యోగ సంఘాల అభిప్రాయ‌మేంటి? పది కీల‌క‌మైన అంశాలివే

Sachivalaya Staff Rationalization : రేషనలైజేషన్‌పై సచివాల‌య ఉద్యోగ సంఘాల అభిప్రాయ‌మేంటి? పది కీల‌క‌మైన అంశాలివే

HT Telugu Desk HT Telugu

Sachivalaya Staff Rationalization : రేషనలైజేషన్ పై సచివాలయ ఉద్యోగుల సానుకూలంగానే స్పందిస్తున్నాయి. అయితే పనిభారం పెరుగుతోందని, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచాయి.

రేషనలైజేషన్‌పై సచివాల‌య ఉద్యోగ సంఘాల అభిప్రాయ‌మేంటి? పది కీల‌క‌మైన అంశాలివే

Sachivalaya Staff Rationalization : స‌చివాల‌య ఉద్యోగుల‌ రేష‌న‌లైజేష‌న్‌పై రాష్ట్ర ప్రభుత్వం మార్గద‌ర్శకాలు విడుద‌ల చేసిన నేప‌థ్యంలో స‌చివాల‌య ఉద్యోగులు సానుకూలంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు ప‌నిభారం పెరుగుతోంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అయితే రేష‌న‌లైజేష‌న్‌ను స‌మర్థిస్తూనే ఉద్యోగ సంఘాలు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసిన మార్గద‌ర్శకాల్లో త‌ప్పులు ఉన్నాయ‌ని, వాటిని స‌రిచేయాల‌ని స‌చివాల‌య ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పది కీల‌క‌ అంశాలివే

1. రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన రేషనలైజేషన్‌ను స‌చివాల‌య‌ ఉద్యోగ సంఘాలు స‌మ‌ర్థిస్తున్నాయి. అయితే రేషనలైజేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లో తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

2. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఉద్యోగంలో చేరి ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తవుతున్నందున ముందుగా అందరు ఉద్యోగుల‌కు ఆయా శాఖల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేసి న్యాయబద్ధంగా తక్షణమే ప్రమోషన్లు కల్పించాలి.

3. ప్రమోష‌న్లను క‌ల్పించ‌డంతో మిగులు సిబ్బంది సంఖ్య తగ్గుతుంది. ఇప్పటికే విడుద‌ల చేసిన మార్గద‌ర్శకాల్లో మిగులు సిబ్బంది సంఖ్యపై క్లారిటీ వచ్చింది. కావున ప్రమోషన్ పొందిన వారు మినహా ఖచ్చితమైన మిగులు సిబ్బంది సంఖ్య వస్తుంది. అయితే మార్గద‌ర్శకాల్లో పేర్కొన్నది ఏ ఏ సచివాలయాలు ఏ ఏ కేటగిరీ క్రిందకు వస్తాయి, ఆయా సచివాలయాల్లో శాంక్షన్డ్ పోస్టులను మాత్రమే తెలుపుతుంది. కానీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగుల‌కు వర్తించదని స్పష్టత ఇవ్వాలి.

4. ఇప్పుడు నికరంగా మిగులు సిబ్బంది ఏ సంఖ్యలో ఉన్నారో ఆ సంఖ్య = ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలలో ఈ సిబ్బందిని నింపుతారో ఆ సంఖ్య + ఆస్పిరేషనల్ సిబ్బంది సంఖ్య ఉండాలి. ఆయా శాఖలు ఖాళీలు పూర్తి వివరంగా తెలియజేస్తూ ఒక జీవోను విడుదల చేయాలి. అలాగే ఆస్పిరేషనల్ సిబ్బందికి సంబంధించి స్పష్టమైన జాబ్ చార్ట్, సర్వీసు రూల్స్ తెలియజేస్తూ జీవో విడుదల చేయాలి.

5. ఇప్పుడు ఏ, బీ, సీ కేటగిరీలోని అన్ని సచివాలయాలు అందులో ఉన్న పోస్టులు, వివిధ శాఖల్లో ఖాళీలు, ఆస్పిరేషనల్ ఖాళీలు అన్నీ ప్రచురించాలి. మెరిట్ లిస్ట్‌లోని ర్యాంక్ ఆధారంగా పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి ఆప్షన్ ఎంచుకొనేలా అవ‌కాశం ఉండాలి. మెరిట్ ఆధారంగా ఉద్యోగికి అవకాశం ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల రేషనలైజేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది.

6. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన సచివాలయాల జాబితాలో జనాభా సంఖ్యలో తప్పులు ఉన్నాయి. దీంతో కొన్ని సచివాలయాల కేటగిరీల వర్గీకరణలో తప్పులు జ‌రిగాయి. దీని కారణంగా సచివాలయాల ఉద్యోగుల వివరాలలో లోపాలు ఉన్నాయి. వాటిని స‌రిచేసి, మరోసారి అప్‌డేట్ చేయ‌డానికి అవ‌కాశం క‌ల్పించాల‌ని స‌చివాల‌య కోరుతున్నారు.

7. స‌చివాల‌యాల్లో ఉద్యోగుల‌ను కుదింపు కార‌ణంగా ప‌నిభారం పెరిగే అవ‌కాశం ఉందని స‌చివాల‌య ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఉన్న ఉద్యోగుల‌కే రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ర్వేలు, సంక్షేమ ప‌థ‌కాల వంటి ప‌నుల‌తో ప‌నిభారం పెంచింది. అయితే ఇప్పుడు ఉన్న ఉద్యోగుల‌ను కుదించడంతో ఆయా స‌చివాల‌యాల్లో ఉద్యోగుల‌పై భారం మ‌రింత ప‌డుతోంది.

8. ప్రమోష‌న్ ఛాన‌ల్‌పై ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు స‌చివాల‌య ఉద్యోగుల ప్ర‌మోష‌న్ల గురించి ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఉద్యోగ సంఘాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌మోష‌న్లు లేకుండా కేవ‌లం ఉద్యోగుల స‌ర్ధుబాటు మాత్ర‌మే చేస్తే ఉద్యోగులకు ఎంటువంటి ప్ర‌యోజ‌నం లేదు.

9. ప్ర‌ధానంగా హేతుబద్ధీక‌ర‌ణ క‌న్నా ముందుగానే జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాల‌ను రూపొందించి ప్ర‌మోష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ‌, వార్డు స‌చివాలయాల్లో ఇంత‌వ‌ర‌కు ప్ర‌మోష‌న్ క‌ల్పించిన వీఏఏ, ఏహెచ్ఏ, వీఎస్ఏ, ఏఎన్ఎంలాగా త‌మ‌కు కూడా సీనియ‌ర్ అసిస్టెంట్ పే స్కేల్‌కు స‌మాన‌మైన హోదాలో ప్ర‌మోష‌న్ ఛాన‌ల్ క‌ల్పించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు.

10. ఇంజినీరింగ్ శాఖ‌ల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీస్ కార్య‌ద‌ర్శుల సేవ‌లను, వెల్ఫేర్ అసిస్టెంట్ సేవ‌ల‌ను సాంఘిక సంక్షేమం, వెనుక‌బ‌డిన‌, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల్లో వినియోగించుకోవాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం