Jagan 2.O : జగన్ 2.O కామెంట్స్ వెనక వ్యూహం ఏంటీ.. వైసీపీ కార్యకర్తల కోసం ఏం చేయబోతున్నారు?
Jagan 2.O : ఏ రాజకీయ పార్టీకి అయినా వెన్నెముక కార్యకర్తలు. అధికారంలో ఉన్నప్పుడు వారిని విస్మరించిన పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓటమి తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన జగన్.. తాజాగా 2.O కామెంట్స్ చేశారు. దీంతో జగన్ కేడర్ కోసం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019లో ఎవరూ ఊహించని విజయం సాధించారు. ఏకంగా 151 నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ స్థాయిలో విజయం రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ.. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్, వైఎస్సార్ ఇమేజ్, టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడం అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఈ అన్ని కారణాల కంటే.. జగన్ కోసం ప్రతీ కార్యకర్త ప్రాణం పెట్టి పనిచేశాడు.
వాలంటీర్ వ్యవస్థతో..
జగన్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు.. మొదటి సంవత్సరం బాగానే ఉన్నారు. ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. జగన్ ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారో.. అప్పటినుంచి కేడర్‌లో అసంతృప్తి మొదలైంది. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు వెళ్లాలని జగన్ మంచిగానే ఆలోచించారు. అదే కార్యకర్తలకు నచ్చలేదు. వాలంటీర్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో కేడర్ ఆహ్వానించినా.. తమ ప్రమేయం లేకుండా చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.
దూరమైన కార్యకర్తలు..
ప్రభుత్వ పథకాల విషయంలో వాలంటీర్లు క్రియాశీలకంగా ఉండగా.. గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో వారు ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019కి ముందు జగన్ కోసం పనిచేసిన చాలామంది ఆర్థికంగా చితికిపోయారు. జగన్ అధికారంలోకి వస్తే బాగుపడతామని అనుకున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలో పార్టీ, ప్రభుత్వం నుంచి సహకారం లేదు. దీంతో చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. కేవలం పదవుల్లో ఉన్నవారే కాస్త యాక్టివ్‌గా ఉన్నారు.
వైఎస్సార్ సమయంలో..
'2004 ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో ఆయన కోసం చాలామందిమి పనిచేశాం. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక తనకోసం పనిచేసేన వారిని కాపాడుకున్నారు. ఇబ్బందుల్లో ఉంటే ఆదుకున్నారు. కానీ.. జగన్ విషయంలో అది జరగలేదు. ప్రజలకు పథకాలు ఇచ్చాం. వారే మనకు ఓటు వేస్తారని జగన్ అనుకున్నారు. కానీ.. ప్రజలను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే కార్యకర్త కావాలనే విషయాన్ని మర్చిపోయారు. కార్యకర్త లేకుంటే ఓటర్ వచ్చి ఎలా ఓటు వేస్తారు' అని మాచర్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు.
అండగా జగన్..
'ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం. జగనన్న 1.0 లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి.. వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను. ప్రజల కోసమే అడుగులు వేశాను. ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. అందుకే కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడు' అని వైసీపీ చీఫ్ భరోసా ఇచ్చారు.
ఏం చేయబోతున్నారు..
2014 నుంచి 2019 మధ్య కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు. 2019 నుంచి 2004 వరకు అదే పరిస్థితి ఉంది. దీంతో మొదటగా.. నిఖార్సైన కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి చర్యలు చేపడతారని తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇంఛార్జ్‌లకు జగన్ ఈ విషయం చెప్పినట్టు తెలిసింది. ఇక చాలామంది కేసుల్లో ఇరుక్కున్నారు. వారికి పార్టీ తరఫున అండగా నిలవనున్నారు. దాడులు, ఇతర ఘటనల్లో నష్టపోయిన వారిని ఆదుకోనున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు స్వయంగా జగన్.. నియోజకవర్గాలకు వెళ్లి కేడర్‌తో మాట్లాడనున్నారు.
యాక్టివ్‌గా లేకపోతే..
క్షేత్రస్థాయిలో కేడర్ యాక్టివ్‌గా లేకపోతే.. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు విజయవంతం కావు. అటు ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులు కొందరు రాజీనామా చేశారు. మరికొందరు వేరే పార్టీల్లోకి వెళ్లారు. ఇప్పుడు మిగిలింది కార్యకర్తలే. దీంతో భవిష్యత్తులో వారి నిర్ణయాలకు పెద్దపీట వేయాలని జగన్ భావిస్తున్నట్టు సమచారం. పార్టీ చేసే కార్యక్రమాలు మొదలు.. అభ్యర్థుల ఎంపిక వరకు.. కార్యకర్తల ఇష్టానికే ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ కామెంట్స్‌తో ఉన్నాళ్లు అసంతృప్తిగా ఉన్నవారు కూడా.. కాస్త యాక్టివ్ అయినట్టున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.