Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాట ఘటన - అసలేం జరిగింది..? ముఖ్యమైన 10 విషయాలు
Tirupati Stampede Incident : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు కోల్పోయారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ వేళ ఈ అపశ్రుతి జరిగింది. మరికొంత మంది భక్తులు గాయపడ్డారు. వీరికి తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి.
తిరుపతి వైకుంఠ ద్వార టికెట్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట
నిత్యం తిరుమలేశుడి నామస్మరణతో మారుమోగే తిరుగిరుల్లో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం జారీ చేసే టికెట్ల కేంద్రాల వద్ధ జరిగిన తొక్కిసలాట పెను విషాదంగా మారింది. తిరుమల చరిత్రలోనే భక్తుల మరణాలు కూడా సంభవించాయి. ఏకంగా ఒకరిద్దరూ కాదు… ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు.
తిరుమల చరిత్రలోనే ఈ ఘటన తీవ్రమైన విషాదమని చెప్పొచ్చు. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా తిరుమలేశుడిని ప్రసన్నం చేసుకునేందుకు వచ్చిన భక్తులు….ఇలా మృత్యువాత పడటం మాటల్లో వర్ణించలేం. మరోవైపు అధికార యంత్రాంగంపై ప్రభుత్వం సీరియస్ అవుతుండగా… ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది..? కారణాలేంటి..? ప్రభుత్వం ఏం చెబుతోంది..? వంటి విషయాలను పరిశీలిస్తే…
తిరుపతి తొక్కిసలాట ఘటన - ముఖ్య విషయాలు
- తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేసింది.
- వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టోకెన్ల జారీ ప్రక్రియ జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది.
- టీటీడీ ప్రకటన నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచే భక్తులు భారీగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
- బుధవారం రాత్రి 8 గంటల తర్వాత టికెట్ల కోసం గేట్లు తెరవగానే భక్తులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. కొన్నిచోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి అదుపులో లేకుండా పోయిందని తెలిసింది. ఈ క్రమంలో భక్తులు దూసుకెళ్లగా.. పలువురు కిందపడిపోయారు.
- తొక్కిసలాట జరిగిన క్రమంలో రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.
- తొక్కిసలాట ఘటనలో చాలా మంది భక్తులు గాయపడ్డారు. వీరికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు మంత్రులు పరామర్శించారు.
- తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(గురువారం) పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. టోకెన్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించారు. తమాషాగా వ్యవహరించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
- తిరుపతిలోని పలు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. బైరాగిపట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే తొక్కిసలాటకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో టీటీడీతో పాటు జిల్లా అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణలో కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
- ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. టీటీడీ ఛైర్మన్ తో పాటు బాధ్యులైన అధికారులపై కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది.
సంబంధిత కథనం