Amaravati Brand Ambassador : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. అర్హతలు, బాధ్యతలు ఏంటి?
Amaravati Brand Ambassador : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి ప్రత్యేకత, అభివృద్ధి వంటి అంశాలను అంబాసిడర్ల ద్వారా ప్రచారం చేయించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.
రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పురపాలక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. నామినేషన్ల ప్రాతిపదికన వీరిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, సీఎంవో నామినేట్ చేసిన వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఎంపిక చేయనున్న సీఆర్‌డీఏ..
నామినేషన్లను పరిశీలించి అర్హత, స్థాయి ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్లను సీఆర్‌డీఏ ఎంపిక చేయనుంది. ప్రస్తుతం ఏడాది కాలానికి వీరిని నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నియమితులైన వారి పనితీరు ఆధారంగా మరింతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎవరు అర్హులు..
సాంకేతికత, సమాజ సేవ, సామాజిక బాధ్యత, అభివృద్ధి వంటి రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉండాలి. బ్రాండింగ్ విషయంలో ప్రతిభ ఉండాలి. అమరావతి అభివృద్ధిపై అంకితభావం, స్థానిక ప్రజలతో మమేకమైనవారై ఉండాలి. దరఖాస్తులను సీఆర్‌డీఏ పరిశీలించి.. ప్రభుత్వ ఆదేశాలతో ఎంపిక చేస్తుంది.
బాధ్యతలు ఏంటి..
అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించేలా ప్రచారం చేయాలి. పరిపాలన, అభివృద్ధి, ఆర్థిక అంశాలను, అనుకూలతలను వివిధ వేదికలపై వివరించాలి. అమరావతికి స్మార్ట్ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలి. సభలు, సదస్సుల్లో పాల్గొని అమరావతి అభివృద్ధిని వివరించాలి. వివిధ సామాజిక మాధ్యమాలు, ఇంటర్వ్యూలు, బ్లాగ్స్ వంటివి వినియోగించి అమరావతి అభివృద్ధిపై ప్రచారం చేయాలి.
ఇలా చేయొద్దు..
అమరావతి గురించి వివాదాస్పద ప్రకటనలు చేయడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతి ప్రాజెక్టును వాడుకోవడం, అమరావతి అభివృద్ధి నిరోధకంగా వ్యవహరించవద్దు. విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయటంతో పాటు.. పెట్టుబడులు తీసుకువచ్చేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాల్సి ఉంటుంది.