Chandrababu : చేతకాని వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తోంది, వైఎస్ వల్ల పోలవరం పదేళ్లు ఆలస్యం- చంద్రబాబు-west godavari tdp chief chandrababu visit polavaram project criticizes cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : చేతకాని వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తోంది, వైఎస్ వల్ల పోలవరం పదేళ్లు ఆలస్యం- చంద్రబాబు

Chandrababu : చేతకాని వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తోంది, వైఎస్ వల్ల పోలవరం పదేళ్లు ఆలస్యం- చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu
Aug 07, 2023 06:43 PM IST

Chandrababu : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యం అయిందన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu : వైఎస్ఆర్ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యం అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టుల పరిశీలన టూర్ లో భాగంగా చంద్రబాబు... ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సోమవారం పరిశీలించారు. చింతలపూడి ప్రాజెక్టు వద్ద సెల్ఫీ తీసుకున్న చంద్రబాబు... సీఎం జగన్ కు ఛాలెంజ్ విసిరారు. చింతలపూడి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో 4.8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా చింతలపూడి ప్రాజెక్టు పనులకు ప్రారంభించామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.2,289 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాజెక్టులు, పట్టిసీమ, పోలవరంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

yearly horoscope entry point

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... వైఎస్ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2004 నుంచి పాలకుల వైఖరి కారణంగా పోలవరం ప్రాజెక్టు రెండుసార్లు బలైందన్నారు. 2004లో మధుకాన్, శీనయ్య సంస్థలు టెండర్లు దక్కించుకుంటే కక్ష సాధింపు చర్యలతో పనులు రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. కమీషన్ల కోసం కాలువ పనులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పోలవరంలో 2004 నుంచి 2014 వరకు జరిగింది 5 శాతం పనులేనని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. 2021 నుంచి అనేక తేదీలు ప్రకటిస్తూ వచ్చారన్నారు. ఇప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటున్నారన్నారు.

కమీషన్ల కోసం గుత్తేదారులు మార్పు

అబద్ధాలతో పోలవరం మీద పుస్తకాలు ప్రచురించారని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ సీఎం అయ్యాక కమీషన్ల కోసం గుత్తేదారులను మార్చారన్నారు. గుత్తేదారును మార్చేందుకు జగన్‌ బంధువుతో విచారణ చేయించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ టైంలో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పిందన్నారు. 2020లో వచ్చిన వరదలతో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని చంద్రబాబు తెలిపారు. కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌లు పూర్తి చేయకపోవడం వల్లే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ వద్దకు నీరు వెళ్లిందన్నారు. దేశంలో పట్టిసీమ లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని.. ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు.. అటువంటి కీలకమైన ప్రాజెక్టు‌ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల పట్టిసీమకు ఎంతో నష్టం కలిగిందన్నారు. కరవు నివారించడానికి కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారని, అందుకే ఆయన విగ్రహాలు ఊరూవాడ పెట్టి పూజిస్తున్నారన్నారు. ఏపీలో ఐదు ప్రధాన నదులు, 69 ఉపనదులు ఉన్నాయన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ లేని నీళ్లు ఏపీలో ఉన్నాయన్నారు. వీటిని సక్రమంగా వినియోగిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు.

Whats_app_banner