West Godavari Tourist Places : ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు-పశ్చిమగోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలివే
West Godavari Tourist Places : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుందరమైన ప్రకృతి ప్రదేశాలు, ప్రముఖ ఆలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ జిల్లాల్లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
West Godavari Tourist Places : గోదావరి జిల్లాలంటే ముందుగా గుర్తొచ్చేంది పచ్చని పల్లెటూరు వాతావరణం. ఎటు చూసినా...పచ్చని పైర్లు, పిల్ల కాలువలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుందరమైన పర్యాటక ప్రదేశాలు టూరిస్టులను ఆకర్షి్స్తున్నాయి. ఈ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు తెలుసుకుందాం. పాపికొండలు, దిండి రిసార్ట్స్ , పేరుపాలెం బీచ్, భీమారామం, క్షీరారామం, నగరేశ్వర స్వామివారి ఆలయం, మావుళ్ళమ్మ దేవస్థానం, కొల్లేరు సరస్సు, ద్వారకా తిరుమల, కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం, మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, నత్తా రామేశ్వరం(దక్షిణ కాశీ) ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.
పాపికొండల బోటింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. గోదావరిలో పాపికొండల నడుమ పడవ ప్రయాణం సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. పట్టిసీమ వీరభద్రస్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, గండిపోచమ్మ గుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, అటవీ శాఖ కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమం ఈ టూర్ లో చూడొచ్చు. గోదావరి వెంట ఇరువైపులా గట్లపై కనిపించే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు, పోలవరం ప్రాజెక్టు పర్యాటకుల మనస్సును దోచుకుంటాయి.
పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో అడవి అందాలు చూపరులను కనువిందు చేస్తాయి. జలపాతాలు, కొండలను తాకే మేఘాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జల్లేరు జలాశయం, ముంజులూరు ఏనుగుతోగు జలపాతం, గుబ్బల మంగమ్మ సన్నిధి, పోగొండ రిజర్వాయర్‌తో పాటు అటవీ ప్రాంతంలోని ప్రదేశాలు పిక్నిక్ స్పాట్‌లుగా ఉన్నాయి.
కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి(జీలకర్రగూడెం) బౌద్ధాలయం పర్యాటకులను ఆకర్షిస్తుంది. నర్సాపురం సమీపంలోని పేరుపాలెం బీచ్ వారాంతంలో కిటకిట లాడుతుంటుంది. సముద్ర స్నానానికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. సముద్రం వెంట పచ్చని కొబ్బరిచెట్లు, సర్వే చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం సమీపంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు పర్యాటకులు పిక్నిక్ స్పాట్ లుగా ఉంటాయి. పంచారామ క్షేత్రాల్లో భీమవరంలోని గునుపూడి ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయాలు టెంపుల్ టూరిజంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రకృతి ప్రేమికులు, బర్డ్ వాచర్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. అలాగే కొల్లేరు పెద్దింట్లమ్మ ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుుకుంటారు. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఏటా జనవరిలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.
సంబంధిత కథనం