Washing Machine : వాషింగ్ మెషిన్ నీటిపై వివాదం.. రాళ్లతో కొట్టి చంపేశారు
Crime News : కేవలం వాషింగ్ మెషిన్ నుంచి వస్తున్న వృథా నీటిపై వివాదం జరిగింది. ఈ ఘటనతో ఓ మహిళ ప్రాణాలు పోయాయి.
వాషింగ్ మెషిన్(Washing Machine) పెట్టిన చిచ్చు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. వృథాగా పోతున్న నీటితో రెండు కుటుంబాల మధ్య గొడవ మెుదలైంది. దీంతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో దారుణం జరిగింది. కదిరి(Kadiri) పట్టణంలోని మశానంపేటలో పద్మావతి అనే మహిళ ఉంటున్నారు. ఆమె ఉపయోగిస్తున్న వాషింగ్ మెషిన్ నుంచి నీరు(Water) వృథాగా పోతోంది. ఇదే రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ వృథా నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్ ఇంటి ముందుకు వెళ్తోంది. ఈ విషయాన్ని.. అతడి కుటుంబ సభ్యులు గమనించారు.
ముందు మెల్లమెల్లగా వివాదం మెుదలైంది. తమ ఇంటి ముందుకు వాషింగ్ మెషిన్ నీరు ఎందుకు వస్తుందని మాటల యుద్ధం పెరిగింది. వేమన్న నాయక్ కుటుంబ సభ్యులు.. పద్మావతిపై బండరాళ్లతో దాడి చేశారు. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముఖం, తలకు దెబ్బలు ఎక్కువగా తగిలాయి. విషయం తెలుసుకున్న స్థానికులు.. బాధితురాలిని కదిరి ఆసుపత్రికి(Kadiri Hospital) తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు(Bengaluru)కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి.. పద్మావతి చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కదిరి పట్టణ పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.
బండతో కొట్టి చంపి హత్య
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. రామశేషు స్థానికంగా పలు వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో ఈ గ్రామంలో మూడు దఫాలు సర్పంచ్ గా కూడా పని చేశారు. కొంతమంది ఆరేళ్ల క్రితం రామశేషుపై దాడి చేశారు. అయితే అప్పుడు గాయాలు కాగా.. కోలుకున్నారు.
మంగళవారం ఉదయం తన గోడౌన్ కు స్టాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది. దీంతో ఆయన బయలుదేరారు. రోడ్డు మీద కాపు కాసిన గుర్తు తెలియని వ్యక్తులు.. రామశేషుపై దాడి చేశారు. తలపై బండరాయితో కొట్టారు. దీంతో రక్తపు మడుగులో పడి ఆయన అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.