Janasena Ippatam Issue : ఇప్పటం వ్యవహారంలో ఆగని మాటల యుద్ధం…
Janasena Ippatam Issue ఇప్పటం గ్రామ రోడ్డు విస్తరణ వ్యవహారంలో జనసేన-వైఎస్సార్సీపీల మధ్య మాటల యుద్ధం ఆగట్లేదు. గత వారం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం 53 ఇళ్లను కూల్చివేయడం రాజకీయ వివాదంగా మారింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములిచ్చినందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జనసేన ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటంలో పార్టీ సభకు రోడ్డు విస్తరణకు సంబంధం లేదని వైసీపీ వాదిస్తోంది.
Janasena Ippatam Issue ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత శుక్రవారం రోడ్డు విస్తరణ పేరుతో ప్రహరీలు, ఆక్రమణలకు మునిసిపాలిటీ అధికారులు తొలగించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇళ్లు కూల్చివేశారంటూ జనసేన ఆరోపించింది. బాధితులకు మద్దతుగా గత శనివారం పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించారు. పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతోనే జనసేన అభిమానులు, సానుభూతిపరుల ఇళ్లను కూల్చివేశారని పవన్ ఆరోపించారు. ఇప్పటంలో ఇళ్లు ధ్వంసమైన వారికి లక్ష రుపాయల ఆర్ధిక సాాయాన్ని కూడా పవన్ కళ్యాణ‌్ ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణకు, పార్టీలకు సంబంధం లేదని వైసీపీ వాదిస్తోంది. చెన్నై కోల్‌కత్తా జాతీయ రహదారి నుంచి కొలనుకొండ గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్ అవతల ఉండే ఇప్పటం గ్రామంలో జనాభా నాలుగువేలకు మించదు. వ్యవసాయ ఆధారిత గ్రామమైన ఇప్పటం నిన్న మొన్నటి వరకు ఎవరికి పెద్దగా తెలియదు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్ల ఎక్కువగా రెడ్డి, కాపు సామాజిక వర్గాల ప్రజలున్నారు. మిగిలిన బీసీ కులాల ప్రజలు కూడా ఈ గ్రామాల్లో గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు.
ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణకు పార్టీలకు సంబంధం లేదని అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు. గ్రామానికి ఉన్న అప్రోచ్ రోడ్డు విస్తరించకుండా ఊళ్లో మాత్రం 120 అడుగుల రోడ్డు విస్తరించడానికి కారణమేంటనేది జనసేన వాదనగా ఉంది. ఇప్పటం వంటి చిన్న గ్రామంలో 120 అడుగుల రోడ్డు అవసరమేమిటనే ప్రశ్న కూడా ఎవరికైనా వస్తుంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పట్టుబట్టడంతోనే రోడ్డు విస్తరణకు అధికారులు పూనుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత మార్చిలో జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇవ్వడమే దీనికి కారణమని చెబుతున్నారు. సర్వే నంబర్ 167,167బిలలో ఉన్న భూముల్లో జనసేన పార్టీ సమావేశాలు జరిగాయి.
167, 167బి సర్వే నంబర్లలో ఉన్న భూముల్లో తొమ్మిది మంది రైతులు జనసేన పార్టీ సమావేశానికి భూమిని ఇచ్చారు. ఆ రైతుల్లో ఇద్దరు తాడేపల్లిలో నివసిస్తుంటే మరొకరు చీరాలలో ఉంటున్నారు. 31మంది భూములిచ్చారని జనసేన చెబుతున్న మాటల్లో నిజం లేదని వైసీపీ చెబుతోంది.
జనసేన పార్టీ సమావేశానికి భూములిచ్చిన వారిలో వింటా సాంబిరెడ్డి, లక్కాకుల ఆదినారాయణ, తిరుమల శెట్టి సామ్రాజ్యం, గాజుల సాంబయ్య, శంకరశెట్టి శ్రీనివాసరావు, శంకరశెట్టి పిచ్చయ్య శంకరశెట్టి రాయుడు, శంకరశెట్టి ఉమామహేశ్వరరావు, గాజుల నర్సయ్య ఉన్నారు. గత వారం ఇళ్లు కూల్చివేసిన బాధితుల్లో శంకరశెట్టి పిచ్చయ్య ఒక్కరే జనసేన ప్లీనరీకి భూమి ఇచ్చారని వైసీపీ చెబుతోంది.
టీడీపీతో సంబంధం ఉన్నపిచ్చయ్య తన ఇంటిని కూల్చకుండా గతంలోనే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని కావాలనే జనసేన నేతలు రాద్దాంతం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై బురద చల్లడానికే ఇళ్లు కూల్చారని యాగీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వ్యూహమా….పొరపాటా….?
ఇప్పటం గ్రామంలో అధికార పార్టీ చేసిన పని వ్యూహాత్మకమా, పొరపాటా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ జరిగిన మూడో రోజే గ్రామంలో రోడ్డు విస్తరణకు మార్కింగ్ ప్రారంభించారు. అంతకు ముందు గ్రామంలో కాపు సామాజిక వర్గ అవసరాల కోసం నిర్మించుకున్న కమ్యూనిటీ హాల్ విషయంలో కూడా వివాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. రెండు వేల ఓట్లున్న ఇప్పటం గ్రామంలో వైసీపీ, టీడీపీలకు సమానంగా గత ఎన్నికల్లో ఓట్లు వచ్చాయి. ఎన్నికల తర్వాత పంచాయితీ స్థలంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ విషయంలో వివాదం తలెత్తింది.
మంగళగిరి ఎమ్మెల్యేగా మురుగుడు హనుమంత రావు ఉన్న సమయంలో పంచాయితీ స్థలంలో గ్రామస్తులు రూ.70లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. దానికి శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కొందరు కోర్టును ఆశ్రయించారు. చివరకు దానికి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంతో వివాదాం రాజుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటం గ్రామంలో జనసేన సమావేశానికి భూములివ్వడానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే వ్యవహారశైలి వల్లే గ్రామంలో వివాదాలు తలెత్తుతున్నాయని, అంతకు ముందు పార్టీ వ్యవహారాలతో కులాలకు సంబంధం ఉండేది కాదంటున్నారు. వైసీపీ మాత్రం ఇప్పటం రోడ్డు విస్తరణ వ్యవహారం నిబంధనల ప్రకారమే జరిగిందని వాదిస్తోంది.