ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై, బాంబు పేలుళ్లకు ప్రయత్నించిన విజయనగరం జిల్లాకు చెందిన యువకుడి బ్యాంకు ఖాతాలో లక్షల రుపాయల నగదును పోలీసులు గుర్తించారు. ఏ ఉద్యోగం చేయని సిరాజ్ ఖాతాలో ఏకంగా రూ.42లక్షల నగదు నిల్వలు ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
విజయనగరంలో అరెస్టైన ఐసిస్ సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. నిఘా వర్గాల సమాచారంతో గత శనివారం హైదరాబాద్, విజయనగరంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందే వీరి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.
శనివారం నిందితుల్ని అదుపులోకి తీసుకున్న వెంటనే వారి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు. సిరాజ్ తండ్రి, సోదరుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో సిరాజ్‌కు ఉన్న సేవింగ్స్ అకౌంట్‌లో రూ.42లక్షలు నగదును గుర్తించారు. అతని పేరుతో ఉన్న ఇతర ఖాతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
విజయనగరంలోని జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు సిరాజ్‌కు సేవింగ్స్, ఎఫ్‌డి ఖాతాలు ఉన్నాయి. అతని కుటుంబ సభ్యులు నలుగురికీ ఇదే బ్యాంకులో నాలుగు ఖాతాలతో పాటు ఏఎస్సైగా పని చేసే తండ్రి పేరిట లాకర్ ఉన్నట్లు గుర్తించారు.
సిరాజ్ తండ్రికి ఏడాది కిందటే విజయనగరం గ్రామీణ పోలీసుస్టే షను బదిలీ అయింది. 2015 నుంచి కొత్తవలస డీసీసీబీ శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్ విజయనగరానికి మార్చుకున్నాడు. సిరాజ్ తండ్రి ఖాతా కొత్త వలసలోనే ఉంది. సిరాజ్ ఖాతాలో పలు విడతలుగా నగదు జమ చేసినట్టు నమోదైంది. అవి ఎవరు జమ చేశారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరి ఖాతాల్లో కలిపి రూ.70లక్షల నగదు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. వీటన్నింటిని ఫ్రీజ్ చేశారు.
మరోవైపు శనివారం సిరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే వారి ఖాతాలను ఫ్రీజ్ చేశారు. సోమవారం డీసీసీబీలో ఉన్న బ్యాంకు లాకర్‌ను తెరిచేందుకు సిరాజ్ తండ్రి ప్రయత్నించారు. అప్పటికే ఖాతాలపై నిఘా ఉండటంతో బ్యాంకు అధికారులు అందుకు అనుమతించలేదు.
మంగళవారం పోలీస్ యూనిఫాంలో వెళ్లి బ్యాంకు అధికారులపై ఒత్తిడి చేసినట్టు గుర్తించారు. ఎన్‌ఐఏ పర్యవేక్షణలో ఖాతాలను ఫ్రీజ్ చేసినట్టు చెప్పడంతో సిరాజ్ తండ్రి వెనుదిరగాల్సి వచ్చింది. బ్యాంకు లాకర్లను తెరిచేందుకు ఎన్‌ఐఏ కోర్టు అనుమతి కోరనుంది. నిందితులను కస్టడీకి అనుమతిస్తే ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం