Vizianagaram Crime : బాలికలపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు
Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ చిన్నారులపై వేధిస్తుండడం ఓ తాపీమేస్త్రీ చూసి, ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు తల్లిదండ్రులు చూపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. బాలికలపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసి ఆ ప్రిన్సిపల్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన విజయనగరం జిల్లా వీరఘట్టంలో ఒక ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ప్రైవేట్ స్కూల్‌లో గత కొన్ని రోజులుగా 3, 5, 6 తరగతులు చదువుతున్న బాలికలను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం ఎవరికైనా చెబితే తోలు తీస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో భయపడిపోయిన ఆ చిన్నారులు గత కొంత కాలంగా ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులను భరిస్తూ బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. కానీ ఎవ్వరికీ చెప్పలేకపోయారు.
అయితే ఈ ఘటన తాపీమేస్త్రీ వల్ల వెలుగులోకి వచ్చింది. ఆ స్కూల్‌కు సమీపంలో ఒక ఇంటిలో తాపీ పని చేస్తున్న మేస్త్రీ, విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ తెర్లి సింహాచలం లైంగిక వేధింపులను చూసి ఫోటో తీశాడు. వాటిని విద్యార్థినుల తల్లిదండ్రులకు చూపించాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు ఆ పాఠశాలలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను నిలదీసి దేహశుద్ధి చేశారు. అనంతరం వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎస్ఐ జి.కళాధర్, పోలీసు సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసు పాఠశాలకు చేరుకుని చిన్నారులను విచారించారు. చిన్నారులు ప్రిన్సిపాల్ వారిపై చేసిన లైంగిక వేధింపులను చెబుతూ చలించిపోయారు. దీంతో ప్రిన్సిపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లాలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన
అనంతపురం జిల్లాలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో విద్యార్థినులు స్కూల్ హెడ్ మాస్టార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆయన పట్టించుకోలేదు. దీంతో విద్యార్థినులు డీఈవోకు లేఖ రాశారు. దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన అనంతపురం జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలంలోని ఒక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు ఆనందరెడ్డి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ విద్యార్థినులను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా ఆయన కూడా పట్టించుకోలేదు.
దీంతో జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో)కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. తమను తెలుగు ఉపాధ్యాయుడు ఆనందరెడ్డి ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడని, ఆయన పైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అలాగే తాము పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఆ ఉపాధ్యాయుడిని ఇక్కడి నుంచి పంపించేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
మండల విద్యా శాఖ అధికారి (ఎంఈవో-2) కృష్ణనాయక్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులను విచారించారు. ఇక నుంచి విద్యార్థినులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించనని తెలుగు ఉపాధ్యాయుడు ఆనంద రెడ్డి అందరి సమక్షంలో క్షమాపణ కోరారు. అయితే విద్యార్థినులు, తల్లిదండ్రులు మాత్రం ఆయన పట్ల ఆగ్రహంతో ఉన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం