అంగరంగ వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం-vizianagaram paidithalli sirimanotsavam begins grandly festival celebrated lakhs of devotees attended ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అంగరంగ వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

అంగరంగ వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

Anand Sai HT Telugu

ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నులపండుగగా మెుదలైంది.

ఘనంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు

విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ప్రధానం ఘట్టమైన సిరిమానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. చదరగుడి నుంచి విజయనగరం కోట వరకు సిరిమానును ఊరేగిస్తారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా పాల్గొంటారు.

పాలధార, తెల్ల ఏనుగు, జాలరివల, అంజలి రథం ఊరేగింపుగా వెళ్తుంటే అమ్మవారి సిరిమాను ముందుకు వెళ్తోంది. గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు సిరిమానును దర్శించుకున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది.

పైడితల్లి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలేళ్లు ఉత్సవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలైన పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తమ పుట్టింటి ఆడపడుచుకు పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఉత్సవానికి రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే తమ కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం.

అక్టోబర్ 14వ తేదీన నాడు తెప్పోత్సవం ఉంటుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి.. తెప్పపై ఊరేగిస్తారు. అక్టోబర్ 21న ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహిస్తారు. అక్టోబర్ 22వ తేదీన అమ్మవారి దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుంది. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆరోజున పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

అయితే సిరిమానోత్సవాల్లో అపశ్రుతి జరిగింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దంపతులు, మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య, మాజీ ఎంపీ బెల్లం చంద్రశేఖర్ కూర్చున్న వేదిక కూలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగలేదు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.