Yuvagalam Vijayotsava Sabha : ఈ నెల 20న యువగళం విజయోత్సవ సభ- ఒకే వేదికపై చంద్రబాబు, పవన్
Yuvagalam Vijayotsava Sabha : నారా లోకేశ్ యువగళం విజయోత్సవ సభ ఈ నెల 20న పోలేపల్లి జరుగనుంది. ఈ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొనున్నారు. ఈ సభకు టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా హాజరుకానున్నారని అంచనా.
Yuvagalam Vijayotsava Sabha : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభను ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లి నిర్వహించనున్నారు. ఈ విజయోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనున్నారు. టీడీపీ-జనసేన పొత్తు కుదిరిన తర్వాత తొలిసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. దీంతో ఇరుపార్టీల నేతలు ఈ సభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్టీసీ ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ
యువగళం విజయోత్సవ సభ ఏర్పాటలు, నిర్వహణపకు టీడీపీ 14 ప్రత్యేక కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, ఆలపాటి రాజేందర్ , బండారు సత్యనారాయణ, ఇతర నేతలు ఉన్నారు. యువగళం విజయోత్సవ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ఈ సభకు బస్సులు కేటాయించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. యువగళం సభకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని డిపోల నుంచి అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులు కేటాయించాలని అచ్చెన్నాయుడు లేఖలో కోరారు.
3000 కి.మీ పూర్తైన యువగళం పాదయాత్ర
నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో 219వరోజు సోమవారం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయింది. యువగళం పాదయాత్ర 3వేల కి.మీ.ల చేరుకున్న సందర్భంగా తేటగుంట యనమల అతిథి గృహం వద్ద యువనేత లోకేశ్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హాజరయ్యారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 3006. 7 కి.మీ.లు పూర్తయింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోడీ బ్లాక్‌బస్టర్ అని లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా తునిలో ఆయన మాట్లాడుతూ.... స్థానిక ఎమ్మెల్యేతో కుమ్మక్కై అవినీతికి పాల్పడిన అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. అవినీతి అధికారులను డిస్మిస్ చేసి జైలుకు పంపుతామన్నారు. కాపు రిజర్వేషన్లపై మంత్రి దాడిశెట్టి రాజాను నిలదీయాలన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు సామాజిక వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. కాకినాడ సెజ్‌లో కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, స్థానికులకు ఉపాధి కల్పిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.