Nara Lokesh : విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం-నవశకం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలకు ముద్దులు పెట్టి రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్నారు. యువగళం ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమే అన్నారు. నవశకం యుద్ధం మొదలైందన్నారు. తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు యుద్ధం ఆగదన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 50 రోజుల పాటు జైలులో పెట్టారని మండిపడ్డారు.
"యువగళం పాదయాత్ర నాకు ఎన్నో విషయాలు నేర్పింది. పాదయాత్రలో అడుగడుగునా ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకున్నాను. ఆడుదాం ఆంధ్ర పేరుతో సీఎం జగన్ ఓ కార్యక్రమం పెట్టారు. దీని గురించి ప్రజలను అడిగా. ఆడుదాం ఆంధ్ర కాదు జగన్ మా జీవితాలతో ఆడుతున్నారు అంటున్నారు. జగన్ కోడికత్తి వారియర్స్ పేరిట ఐపీఎల్ టీమ్ తీసుకోస్తున్నారు" - నారా లోకేశ్
జగన్ దగ్గర రెండు బటన్లు ఉన్నాయని లోకేశ్ అన్నారు. బ్లూ బటన్ నొక్కి డబ్బులు వేస్తారని, రెడ్ బడన్ నొక్కి ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేస్తారన్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టారీతిన పెంచారని మండిపడ్డారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ 100 సంక్షేమ పథకాలు కట్ చేశారని ఆరోపించారు.
సీఎం జగన్ విశాఖను ఏపీకి రాజధాని చేస్తానని చెప్పి క్రైమ్ క్యాపిటల్ చేశారని లోకేశ్ ఆరోపించారు. విశాఖను కబ్జాల రాజధానిగా మార్చాడని మండిపడ్డారు. దసపల్లా భూములు, ఏఎన్‌బీసీ భూములు, హయగ్రీవ భూములు, ఎక్స్ సర్వీస్‌మెన్ భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, శివారు ప్రాంతాల్లో చెరువులను పూర్తిగా కబ్జా చేశారని లోకేశ్ ధ్వజమెత్తారు. విశాఖకు రావాల్సిన లూలూ మాల్‌ను తరిమేశారన్నారు. టీడీఆర్ బాండ్స్ పేరుతో వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలను కొట్టేశారని విమర్శించారు.
రాయలసీమ ప్రజల కష్టాలు తీర్చడానికి మిషన్ రాయలసీమ ప్రకటించానని నారా లోకేశ్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం రాగానే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌గా తయారు చేస్తామన్నారు. స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్‌గా, నెల్లూరులో ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తామన్నారు. ప్రజా రాజధానిగా అమరావతిని పూర్తి చేస్తామన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, కొబ్బరి, వరి, పామ్ ఆయిల్ రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలు మళ్లీ ఇస్తామని లోకేశ్ అన్నారు.