Yuvagalam Meeting : పోలిపల్లిలో యువగళం సభకు భారీ ఏర్పాట్లు-పదేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, పవన్
Yuvagalam Meeting : విజయనగరం జిల్లా పోలిపల్లిలో యువగళం-నవశఖ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. ఈ సభలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటున్నారు.
Yuvagalam Meeting : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం సాయంత్రం 'యువగళం-నవశకం' పేరిట టీడీపీ విజయోత్సవ సభకు నిర్వహిస్తోంది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరవుతున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పోలిపల్లికి చేరుకుంటున్నారు. ఇరుపార్టీల పొత్తు కుదిరిన తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ తొలిసారిగా కనిపిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ సభపై ఆసక్తి నెలకొంది. ఈ రెండు పార్టీలు ఈ వేదికగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాయని శ్రేణులు భావిస్తున్నాయి.
110 ఎకరాల్లో సభ ఏర్పాట్లు
యువగళం విజయోత్సవ సభకు టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల నుంచి జరుగనున్న బహిరంగ సభకు సుమారు 110 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సభలో టీడీపీ, జనసేన శ్రేణులు సుమారు 5 లక్షలకు పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 50 వేల మంది కూర్చుని బహిరంగంగా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ 16 కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి. విజయోత్సవ సభ స్టేజ్ పై 600 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. స్టేజ్ వెనుక 50 అడుగులతో భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక రైళ్లలో విజయనగరం చేరుకుంటున్నారు. సొంత వాహనాల్లో వచ్చే వారికి ఉత్తరాంధ్ర వైపు 2 పార్కింగ్ స్థలాలు, విశాఖ వైపు 2 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
విశాఖకు పవన్
యువగళం విజయోత్సవ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పోలేపల్లిలో జరిగే యువగళం విజయోత్సవ సభలో వెళ్లనున్నారు. దాదాపుగా పదేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనిపించనుండటంతో....టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలివస్తున్నారు.