Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో దారుణం, విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి యత్నం!
Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లిమర్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డీఈవో నివేదికలో అసభ్యకర ప్రవర్తన నిజమని తేలడంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
విజయనగరం జిల్లాలో ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినిలపై లైంగిక దాడికి యత్నించాడు. ఆ కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు అయింది.
ఈ ఘటన విజయనగరం జిల్లా నెలిమర్ల మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు అయింది. నెలిమర్ల ఎస్ఐ బి.గణేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఒక గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై అదే పాఠశాలలో పని చేస్తున్న బయాలజీ ఉపాధ్యాయుడు ఎం.వెంకటరావు అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత శనివారం విద్యార్థినిని ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌పై తాకాడు. దీంతో మూడు రోజులుగా బాలిక ముభావంగా ఉంటూ తిండితినడం మానేసింది.
తల్లి ఏమైందంటూ బాలికను ప్రశ్నించగా, ఉపాధ్యాయుడు తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని వివరించింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం సదురు ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరు అయ్యారు. దీంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడితో పాటు ప్రధానోపాధ్యాయుడిని కూడా ప్రశ్నించారు. అనంతరం నెలిమర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కీచక ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు.
ఎస్ఐ గణేష్, సిబ్బంది పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఉండడం గమనార్హం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ గణేష్ తెలిపారు. డిప్యూటీ డీఈవో కేవీ రమణ పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరలించారు. నివేదికను డీఈవో మాణిక్యం నాయుడు అందజేస్తామని తెలిపారు. డీఈవో నివేదిక ప్రకారం ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన నిజమని తేలిందని, ఈ మేరకు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు.
కాకినాడ రూరల్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులే, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. విజయనగరం జిల్లా నెలిమర్ల మండలంలో చోటుచేసుకున్న ఘటన లాంటిదే, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలో కూడా వెలుగు చూసింది. గత నెల 28న ఎనిమిదో తరగతి విద్యార్థినులతో ఒక ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే విద్యార్థినీలు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయలేక, ఇంటి వద్ద చెప్పలేక నరక యాతన అనుభవించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యార్థినిల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించే ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా బయటకు వచ్చింది. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయదుర్గ స్పందిస్తూ విద్యార్థినుల నుంచి ఫిర్యాదు అందిందని, సదరు ఉపాధ్యాయుడిని విచారిస్తే తాను అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పి, మెడికల్ లీవ్‌లో ఉన్నారని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, మహిళా పోలీసు వచ్చి విద్యార్థినుల వద్ద వివరాలు సేకరించినట్లు చెప్పారు. దీనిపై ఇంద్రపాలెం ఎస్ఐ వీరబాబు స్పందిస్తూ విద్యార్థినుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాలేదని, ఆనోటా, ఈనోటా ఆలకించడంతో మహిళా పోలీసును పంపించి వివరాలు సేకరించామని అన్నారు. పాఠశాల విషయం బయటకు రాకుండా ఉపాధ్యాయుడిని కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు