Vizianagaram News : విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం, బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య
Vizianagaram News : విజయనగరం జిల్లా చింతలపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తలు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలతో బయటపడగా, ముగ్గురు మృతి చెందారు.
Vizianagaram News : విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. కొత్తవలస మండలం చింతలపాలెంకు చెందిన భార్యాభర్తలు తమ కుమార్తెతో పాటు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎండీ మొహినుద్దీన్ (46) తన కుటుంబంతో కలిసి విశాఖ మర్రిపాలెం పరిధిలోని ఎఫ్‌సీఐ నగర్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం మొహినుద్దీన్ భార్య సంషినిషా (39), కుమార్తె ఫాతిమా జహీదా (17), కుమారుడు అలీతో కలిసి కొత్తవలస దగ్గర్లోని చింతపాలెంలోని తమ స్థలం వద్దకు వెళ్లారు. అనంతరం అక్కడ ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మొహినుద్దీన్, అతడి భార్య, కుమార్తె మృతి చెందగా, కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో కొత్తవలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబం మొత్తం బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బావిలోని మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మొహినుద్దీన్ బంధువులకు సమాచారం అందించారు. కొత్తవలస సీఐ చంద్రశేఖర్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల విశాఖలో మరో ఘటన
అప్పులు తీర్చలేక విశాఖకు చెందిన ఓ కుటుంబం ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా కుమార్తె చావు బతుకులతో పోరాడుతోంది. గత నెల 25న ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడంతో భార్యాభర్తలు మరణించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక భార్య, భర్త, కూతురు పురుగుల మందు తాగారని పోలీసులు నిర్థారించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గొరపల్లి గ్రామంలో ఈ విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో కుటుంబ పెద్ద అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యం అనుకొని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కిరాణాషాపు నడుపుతున్న సత్యనారాయణ (52), అతని భార్య సూర్య కుమారి (45), కుమార్తె నీలిమ (20) పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశారు. వారి కుమారుడు సంతోష్ విశాఖలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో ఇంట్లో లేడని తెలుస్తోంది. వారిని చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ సత్యనారాయణ, అతని భార్య సూర్యకుమారి మరణించారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.