విజయనగరంలో విషాద ఘటన జరిగింది. పట్టణంలోని కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. కారులో చిక్కుకుని ఊపిరి ఆడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారులు ఇవాళ ఉదయం ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు.
పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా వారి ఆచూకీ లభించలేదు. స్థానికంగా ఉన్న మహిళా మండలి ఆఫీసు వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు పిల్లల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఆడుకునేందుకు కారులోపలికి వెళ్లగా...లాక్ పడి ఊపిరి ఆకడ చిన్నారులు మృతి చెందారని తెలుస్తోంది.
మృతులు చారుమతి, ఉదయ్, చరిష్మా, మనస్విగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల్లో చారుమతి, చరిష్మా ఇద్దరు అక్కాచెల్లెళ్లు అని స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి నలుగురు పిల్లలు మృతిచెందడంతో ద్వారపూడిలో విషాదం అలుముకుంది. విగతజీవులైన చిన్నారులను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోదించారు.
చిత్తూరు జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. దేవరాజపురంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గౌతమి, షాలిని, అశ్విన్ మృతి చెందారు.
ఏలూరు జిల్లాలోని జల్లేరు జలాశయం చూసేందుకు వెళ్లి షేక్ సిద్దిఖ్ , అబ్దుల్ నీటి మునిగి చనిపోయారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు బావిలోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పీలేరు మండలం బాలమువారిపల్లి పంచాయతీ పరిధిలోని కురవపల్లి వద్ద ఆదివారం వేకువజామున కారు బావిలోకి దూసుకెళ్లింది. .
కర్ణాటకలోని కోలార్ కు చెందిన శివన్న, లోకేశ్, గంగరాజులు ఏపీకి వ్యక్తిగత పనుల మీద వచ్చారు. పని పూర్తి చేసుకుని తిరిగి స్వస్థలానికి వెళ్తూ...కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్న, లోకేశ్, గంగరాజు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బావి నుంచి కారు, మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం