జూన్ 21న వైజాగ్‌లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. దీంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఓ ప్రకటన వెలువడింది. రాష్ట్ర ప్రజలు చురుగ్గా పాల్గొనాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి అని అభివర్ణించిన గవర్నర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
జూన్ 21న జరిగే యోగా దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేసినట్లు రాజ్ భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రజలు పాల్గొంటారని అంచనా.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించడం విశాఖ నగరవాసులకు ఒక ముఖ్యమైన అవకాశమని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ఈ నెల 21న జరగనున్న యోగా ఆంధ్ర వేడుకల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకొంటున్నామని మంత్రి అనిత చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వెల్లడించారు. 'ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యకరమైన రాష్ట్రంగా మార్చే దిశగా మనం ముందుకు సాగుతున్నాం. యోగా ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి. ఇది జీవితంలో అంతర్భాగం.' అని ఆమె వ్యాఖ్యానించారు.
326 కంపార్ట్‌మెంట్‌లను ఏర్పాటు చేయడం, 2,000కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం వంటి సన్నాహాలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, ఏవైనా సంఘటనలు జరగకుండా నిరోధించడానికి చర్యలు తీసుుంటున్నారు. పాల్గొనేవారికి యోగా మ్యాట్, టీ-షర్ట్, ఓఆర్ఎస్ బాటిల్ అందజేస్తారు.
మరోవైపు నేటి నుంచి విశాఖ బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్ జోన్. ఈ నెల 21వ తేదీ వరకు ఆర్కే బీచ్ రోడ్డు మూసివేస్తున్నారు. 5 కి.మీ పరిధిలో డ్రోన్లపై నిషేధం ఉంది.