Viveka Murder Case : వివేకా లేఖకు నిన్ హైడ్రిన్ టెస్ట్, వేలి ముద్రలు గుర్తించే పనిలో సీబీఐ!
Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలకమైన లేఖను నిన్ హైడ్రిన్ టెస్ట్ చేసేందుకు కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఈ టెస్ట్ లో లేఖపై ఉన్న వేలిముద్రలు గుర్తించవచ్చని సీబీఐ అంటోంది.
ట్రెండింగ్ వార్తలు
Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. వివేకా రాసిన లేఖను నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి పొందింది. వివేకా రాసిన లేఖపై ఉన్న వేలిముద్రలను గుర్తించే పనిలో పడింది సీబీఐ. నిన్‌హైడ్రిన్ పరీక్ష కోసం ఈ లేఖను దిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్ కు పంపించేందుకు కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది. ఒరిజినల్ లేఖను కోర్టుకు సమర్పించి, సర్టిఫైడ్ కాపీలను తీసి పెట్టుకోవాలని కోర్టు సీబీఐకి సూచించింది. నిన్ హైడ్రిన్ పరీక్షలో ఒక వేళ ఒరిజినల్ లేఖ దెబ్బతిన్నట్టయితే సర్టిఫైడ్ కాపీని సాక్ష్యంగా సమర్పించాలని సీబీఐని తెలిపింది. డ్రైవర్ ప్రసాద్ తనను హత్య చేసినట్టు వివేకా హత్యా జరిగిన స్థలంలో ఈ లేఖ లభించింది. లేఖను 2021లో సీబీఐ కడప కోర్టు ద్వారా తీసుకుంది. వివేకా లేఖను 2021 ఫిబ్రవరి 11న దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ పంపించి, లేఖ వివేకా రాసిందేనా? ఒత్తిడిలో రాశారా? అని విశ్లేషించాలని నివేదిక ఇవ్వాలని కోరింది. వివేకా రాసిన ఇతర పత్రాలతో పోల్చిన సీఎఫ్ఎస్‌ఎల్ .. అది వివేకా రాసిందేనని, అయితే తీవ్ర ఒత్తిడిలో రాసినట్లు తేల్చి సీబీఐకి నివేదిక ఇచ్చింది. అయితే ఆ లేఖను బలవంతంగా రాయించినట్టు దస్తగిరి తెలపడంతో, లేఖపై వేలిముద్రలు గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను సీబీఐ మరోసారి కోరింది.
నిన్ హైడ్రిన్ టెస్ట్ కు కోర్టు అనుమతి
వివేకా లేఖపై వేలిముద్రలు గుర్తించాలంటే నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు సీబీఐ అధికారులకు తెలియజేశారు. అయితే నిన్ హైడ్రిన్ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంక్ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో లేఖ కీలక ఆధారంగా ఉండడంతో సీబీఐ కోర్టును ఆశ్రయించింది. నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతివ్వాలని కోర్టును కోరింది. అసలు లేఖ బదులుగా జిరాక్స్‌ను రికార్డుల్లో ఉంచాలని కోర్టును కోరింది. ఈ లేఖపై వేలిముద్రలను పోల్చిచూడాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలను నిందితుల తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు. ఆ పిటిషన్ చట్టసమ్మతం కాదని వాదించారు. అయితే లేఖ నిన్ హైడ్రిన్ టెస్ట్ కు అనుమతిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
అసలేంటీ నిన్ హైడ్రేట్ టెస్ట్ ?
పేపర్ ఉపరితలాలపై వేలిముద్రలను గుర్తించడానికి నిన్ హైడ్రిన్ టెస్టును నిర్వహిస్తారు. ఫోరెన్సిక్ పరీక్షలకు దొరకని ఆధారాలను గుర్తించేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. కొన్ని రసాయనాల ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తారు. అత్యంత నిపుణులు చేసే ఈ టెస్టు ద్వారా లేఖపై ఉన్న వేలి ముద్రలు, ఇతర గుర్తులన్నింటినీ వెలికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఈ టెస్టు కీలకంగా మారింది.
సంబంధిత కథనం