Karthika Masam 2024 : కార్తీకమాసంలో ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టం.. ఎక్కడ ఉందో తెలుసా?-visiting the daida bilam amaralingeswara temple in karthika masam is auspicious ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Karthika Masam 2024 : కార్తీకమాసంలో ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టం.. ఎక్కడ ఉందో తెలుసా?

Karthika Masam 2024 : కార్తీకమాసంలో ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టం.. ఎక్కడ ఉందో తెలుసా?

Basani Shiva Kumar HT Telugu
Nov 05, 2024 04:27 PM IST

Karthika Masam 2024 : పూర్వకాలం నుంచి పూజలందుకుంటున్న ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు కొండపైన, గుహల్లో, అరణ్యప్రాంతాల్లో వెలసినవే. అలా ఒక కొండ గుహలో వెలసిందే దైద బిలం అమరలింగేశ్వర ఆలయం. ఇది గుంటూరు జిల్లా గుత్తికొండలో ఉంది. ఈ ఆలయం విశేషాలు ఓసారి చూద్దాం.

దైద బిలం అమరలింగేశ్వర ఆలయం
దైద బిలం అమరలింగేశ్వర ఆలయం

దైద బిలం అమరలింగేశ్వర ఆలయానికి ఓ విశేషం ఉంది. ఇక్కడ కొండగుహలోని చిమ్మచీకట్లోనే దీపం వెలుగులో దేవదేవుడు భక్తులకి దర్శనం ఇస్తారు. అందుకే ఈ దేవాలయాన్ని చీకటి మల్లయ్య ఆలయం అని కూడా అంటారు. ఇది గుంటూరు జిల్లా గురజాల నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. పులిపాడు, దైదా మార్గం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గుత్తికొండలో ఈ శైవ క్షేత్రం ఉంది.

ఈ కొండగుహనే గుత్తికొండ బిలం అని కూడా అంటారు. చుట్టూ పర్వతశ్రేణి, మధ్యలో బిల సముదాయం ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బిలం. అమరలింగేశ్వరుడు ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్దమైన బిలం (గుహ)లో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శివుడు, కొండ గుహలో స్వయంభువుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

ద్వాపరయుగంలో కాలయవనుని బారి నుండి తప్పించుకున్న శ్రీకృష్ణుడు ఈ బిలంలోకి ప్రవేశించి.. అక్కడ తపస్సు చేస్తున్న ముచికుంద మహర్షి పైన తన ఉత్తరీయాన్ని కప్పి పక్కకు వెళ్తాడు. అయితే ఆయనే శ్రీకృష్ణుడు అని భావించిన రాక్షసుడు ఆ మునికి తపోభంగం కలిగించడంతో ఆగ్రహించిన ముని.. ఆ రాక్షసుడిని భస్మం చేసినట్లు పురాణం చెబుతోంది. పాపపరిహారార్థం ముచుకుంద మహాముని ఈ శివలింగం ప్రతిష్టించాడు అని కూడా అంటారు.

ఈ బిలం ప్రధాన ద్వారం అడుగుపెపెట్టి లోపలి వెళుతుండగా చీకటి మల్లయ్య పూజలందుకుంటూ కనిపిస్తాడు. ఇక్కడ ఉన్న ప్రధాన బిలం నుండి లోపలి వెళితే 101 బిలాలు ఉన్నాయని చెబుతారు. ఇలా ఇంకా కొంచం ముందుకు వెళితే అక్కడ గరళం సేవించే శివుడి విగ్రహాం ఉందని చెబుతారు. చిమ్మ చీకట్లో విద్యుత్ దీపాల వెలుగులో ముందుకు వెళుతుంటే.. నీటికొలను కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. స్వామి దర్శనానికి వచ్చిన వారంతా ఈ కొలనులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

కార్తీకమాసంలో ప్రతి సోమవారం భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతో బిలంలో 900 మీటర్లు నడచి అమరలింగేశ్వరుడిని దర్శించుకుంటారు. బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెబుతారు. ఆ తరువాత 100 సంవత్సరాల కిందట పులిపాడు గ్రామస్థులు కాండ్ర రామయ్య, పోట్ల హనుమయ్య తదితరులు ఆ బిలం సమీపంలో పశువులు కాచుకుంటుండగా మంత్రోచ్చారణలు వినిపించాయని అంటారు.

వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెతకగా.. బండరాళ్ల మాటున బిలద్వారం కనపడింది. గ్రామస్థుల సహాయంతో తాడులు కట్లుకుని బిలం లోపలికి ప్రవేశించారు. ఆ ఇరుకైన బిలంలో కొంతదూరం ప్రయాణించగా అక్కడ వారికి దివ్యలింగాకారం సాక్షాత్కరించింది. అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్లను గమనించారు. నాటి నుంచి శ్రీ అమరలింగేశ్వరస్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం విరాజిల్లుతుంది.

అమరలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం కష్టంతో కూడుకుంది. బిలం లోపల వందల మీటర్ల దూరంలో కొలువైనందున వృద్దులు, మహిళలు, చిన్నారులకు స్వామిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతారు. బిలం లోపకి వెళ్లటానికి, బయటకు రావటానికి వేరువేరు మార్గాలు ఉన్నాయి. లోపల ఇరుకైన మార్గం ఉంటుంది. అక్కడక్కడ ఒంగి, కూర్చుని వెళ్లాల్సి వస్తుంది.

బిలం లోపలకి ప్రవేశించిన తరువాత 500 మీటర్ల దూరంలో అమరలింగేశ్వరస్వామి కొలువైన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఆ స్వామికి కృష్ణానది నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేసి పూజలు చేస్తారు. ఆ తరువాత మరో 500 మీటర్లు నడక సాగిస్తే బిలం బయటకు వస్తాం. బిలం లోపల నడక దారిలో ఇతర మార్గాలు కనపడతాయి. అవి శ్రీశైలం, కాశీ, ఎత్తిపోతల, గుత్తికొండ బిలం ప్రాంతాలకు వెళ్లే మార్గాలని ఇక్కడివారు చెబుతారు. కొందరు ఈ మార్గాల్లో వెళ్లి కనపడకుండా పోయారని అంటున్నారు.

ఇక్కడి స్వామి కోరిన వరాలు తీర్చే కొంగు బంగారం అని భక్తుల విశ్వాసం. సోమవారం రోజున కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో ఆ లింగాకారుడిని తాకి, కృష్ణా జలాలతో అభిషేకించి, ఆ రాత్రి నిద్రచేస్తే ఎంతటి కోరికలైనా తీరతాయని భక్తులు నమ్మకం. బిలంలో గర్భాలయం పైన ఆరిచెట్టు ఉంది. పిల్లలు లేనివారు ఆరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉయ్యాలకడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

Whats_app_banner