Ugadi Awards : ఈ నెల 30న విశ్వసునామ ఉగాది వేడుకలు- 14 రంగాల్లో ప్రముఖులకు క‌ళార‌త్న, ఉగాది అవార్డులు-vishwasunama ugadi celebrations kala ratna and ugadi awards to eminent personalities in 14 fields ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ugadi Awards : ఈ నెల 30న విశ్వసునామ ఉగాది వేడుకలు- 14 రంగాల్లో ప్రముఖులకు క‌ళార‌త్న, ఉగాది అవార్డులు

Ugadi Awards : ఈ నెల 30న విశ్వసునామ ఉగాది వేడుకలు- 14 రంగాల్లో ప్రముఖులకు క‌ళార‌త్న, ఉగాది అవార్డులు

HT Telugu Desk HT Telugu

Ugadi Awards : ఈ నెల 30న విశ్వసునామ ఉగాది వేడుకలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో 14 రంగాలలో సేవలందించిన ప్రముఖులకు కళారత్న అవార్డులు, ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

ఈ నెల 30న విశ్వసునామ ఉగాది వేడుకలు- 14 రంగాల్లో ప్రముఖులకు క‌ళార‌త్న, ఉగాది అవార్డులు

Ugadi Awards : విశ్వసునామ ఉగాది వేడుక‌లు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 30 రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుక‌లు నిర్వహించ‌నుంది. ఈ వేడుక‌ల్లో 14 రంగాల్లో సేవ‌లందించిన ప్రముఖుల‌కు క‌ళార‌త్న అవార్డులు, ఉగాది పుర‌స్కారాలు ప్రదానం చేస్తారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోఈ ఉగాది వేడుకలకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత జ‌రిగే మొద‌టి ఉగాది పండ‌గ కావ‌డంతో చాలా ఘ‌నంగా నిర్వహించాల‌ని ప్రభుత్వం యోచిస్తుంది.

ఉగాది ఉత్సవాల‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబ‌ర్ 56ను విడుద‌ల చేశారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగను రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటున్నామ‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తామ‌న్నారు. కళ, సంస్కృతితో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డులను ప్రదానం చేస్తామ‌ని తెలిపారు. ఎండోమెంట్, వ్యవసాయం, ఉద్యానవన శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి.

తొమ్మిది విభాగాల్లో క‌ళార‌త్న అవార్డులు

క‌ళార‌త్న అవార్డుల‌ను తొమ్మిది విభాగాల్లో ఇస్తారు. కళారత్న అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అంద‌జేస్తారు. 1) సాహిత్యం, 2) సంగీతం, 3) నృత్యం, 4) చిత్రలేఖనం, 5) శిల్పం, 6) నాటకం, 7) జానపదం, 8) మిమిక్రీ, 9) అవధానంతో వంటి కళారూపాలల్లో ప్రముఖుల‌కు హంస ప్రతిమ, శాలువా, సర్టిఫికెట్‌ను ప్రదానం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

14 విభాగాల్లో ఉగాది పుర‌స్కారాలు

ఉగాది పుర‌స్కారాలు 14 విభాగాల్లో ఇస్తారు. 1) సాహిత్యం, 2) సంగీతం, 3) నృత్యం, 4) చిత్రలేఖనం, 5) శిల్పం, 6) నాటకం, 7) జానపదం, 8) మిమిక్రీ, 9) అవధానం, 10) వైద్యం, 11) మ్యాజిక్ & మైమ్, 12) హరికథ, బుర్రకథ, 13) జర్నలిజం, 14) సామాజిక సేవతో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖుల‌కు ఉగాది అవార్డుల‌ను అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 10,000 మొత్తాన్ని సాంస్కృతిక శాఖ ద్వారా ప్రదానం చేస్తారు. అలాగే మెమోంటో, శాలువా, సర్టిఫికెట్‌ను ప్రదానం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

క‌ళార‌త్న (హంస‌), ఉగాది అవార్డు గ్రహీతల ఎంపిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంస్కృతి శాఖ‌ కమిషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. దీంతో ఈ అంశాన్ని పరిశీలించిన తరువాత‌ కళారత్న (హంస), ఉగాది అవార్డు గ్రహీతల ఎంపిక కోసం ప్రభుత్వం సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

11 మంది స‌భ్యుల‌తో క‌మిటీ

కళార‌త్న (హంస‌), ఉగాది అవార్డు గ్రహీతల ఎంపిక కోసం 11 మందితో రాష్ట్ర ప్రభుత్వం క‌మిటీ వేసింది. కమిటీ చైర్మన్‌గా అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, క‌మిటీ స‌భ్యులుగా ఏపీఎస్‌సీ&సీసీ చైర్మన్‌ పొడపాటి తేజస్వి ఛైర్‌పర్సన్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మృదంగం క‌ళాకారుడు, "పద్మశ్రీ" డి.సుమతి రామమోహన్ రావు, గానం క‌ళాకారుడు, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత మల్లాది సూరిబాబు, కూచిపూడి నాట్య విద్వాంసుడు, ఎస్ఎన్ఏ అవార్డు గ్ర‌హీత డా. వేదాంతం రాధేశ్యం, బుర్రక‌థ క‌ళాకారుడు బాబుజీ, ప్రముఖ సాహిత్యకారుడు పాపినేని శివ‌శంక‌ర్‌, రిటైర్డ్ ఆంధ్రా యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్‌, ప్రముఖ క‌ళాకారుడు దాసు, రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్య‌ట‌క‌, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి అజ‌య్ జైన్‌, స‌భ్యుడు, క‌న్వీన‌ర్ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్‌.మ‌ల్లికార్జున రావును రాష్ట్ర ప్రభుత్వం నియ‌మించింది. రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త‌దనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాల‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రిపోర్టర్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk