VandeBharat Bookings : సంక్రాంతి వేళ.. వేగంగా వందే భారత్ బుకింగ్స్
VandeBharat Bookings : విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ట్రైన్ బుకింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణం అయ్యేందుకు వందే భారత్ ను ఎంచుకుంటున్నారు. దీంతో.. పలు తేదీల్లో టికెట్ల కోటా ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్లింది.
VandeBharat Bookings : సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ రైలుకి టికెట్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. విపరీతమైన రద్దీ నెలకొనే పండుగ సమయంలో ఈ ట్రైన్ సర్వీసు ప్రారంభమైంది. సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యే వారికి .. వందే భారత్ ట్రైన్ భారీ ఉపశమనం కలిగించింది. తిరుగు ప్రయాణానికి ఇతర రైళ్లు, బస్సుల్లో టికెట్లు లేని వారు.. విశాఖ - సికింద్రాబాద్ రైలుకి రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దీంతో.. కనుమ మరుసటి రోజు.. అంటే జనవరి 17, 18 తేదీల్లో విశాఖ - సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలుకి టికెట్లు ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి. ఈ రెండు తేదీల్లో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ విభాగాల్లో టికెట్ల కోటా పూర్తయింది. జనవరి 22 వరకు ఈ రూట్ లో రద్దీ ఉండే అవకాశం ఉన్నందున... మిగతా తేదీల్లో కూడా త్వరలోనే టికెట్లు అన్నీ బుక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు... సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడిచే వందే భారత్ సర్వీసుకి మాత్రం రిజర్వేషన్ సాధారణంగానే సాగుతోంది.
సంక్రాంతి గిఫ్ట్ గా వందే భారత్ రైలుని.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ 10వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి పరుగులు పెట్టే ఈ రైలును మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై తో పాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. జనవరి 16 నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకే ఈ వందే భారత్ రైలు అని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇక వేగవంతమైన ప్రయాణం కొనసాగుతుందని... వందే భారత్ ద్వారా విలువైన సమయం ఆదా అవుతుందని చెప్పారు.
విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలుకి - 20833... సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలుకి - 20834 ట్రైన్ నంబర్లు కేటాయించారు. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందేభారత్ రైలు సేవలందించనుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అంటే కేవలం ఎనిమిదిన్నర గంటల్లో విశాఖ చేరుకుంటుంది. 14 ఏసీ ఛైర్ కార్ కోచ్ లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ లు కలిపి మొత్తం 16 కోచ్ లతో కూడిన రైలులో 1,128 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి.