MP MVV Satyanarayana : కిడ్నాప్ వ్యవహారంలో కుట్రకోణం, సీబీఐ విచారణకు ఎంపీ ఎంవీవీ డిమాండ్
MP MVV Satyanarayana : మూడు రోజులు రెక్కీ నిర్వహించి తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. నిందితులతో తనకు సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.

MP MVV Satyanarayana : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్ర గంగిరెడ్డితో తనకు లావాదేవీలు ఉన్నాయన్న ఆరోపణలు సరికాదన్నారు. సీబీఐతో విచారణ చేయిస్తే కిడ్నాపర్లు ఇంట్లోకి ఎలా వచ్చారో తెలుస్తుందన్నారు. తాను రూ.వెయ్యి కోట్ల లావా దేవీలు చేశానన్న ఆరోపణలు ఆరోపణలు చేస్తున్నారనిస అసలు తన ఆస్తి మొత్తం అంత ఉండదని ఎంపీ అన్నారు. కిడ్నాపర్లు తన కుటుంబ సభ్యులను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారి నెంబర్లు అడిగారన్నారు. కిడ్నాపర్లు గంజాయి తాగుతూ చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. హేమంత్, రాజేష్ ఇద్దరూ రౌడీ షీటర్‌లు అన్న ఎంవీవీ, పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ జరిగిందన్నారు. నిందితులతో తనకు పరిచయంలేదన్నారు. తన ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నా
విశాఖ సేఫ్ కాదని అనడం కరెక్ట్ కాదని ఎంపీ ఎంవీవీ అన్నారు. నగరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు రెండు గంటల్లోనే ట్రేస్ చేశారన్నారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు సహజమే అన్నారు. నేరాలు, మత ఘర్షణలు వంటివి అన్నీ ప్రభుత్వాల టైంలో జరిగాయన్నారు. బిజినెస్ విషయంలో తాను హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నట్టు ఎంపీ స్పష్టం చేశారు. వ్యాపారం విషయంలో తనపై ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మనస్తాపంతోనే.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు షిప్టు అవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు వంద నిర్మాణాలు చేశానని, ఎక్కడా చెడ్డపేరు రాలేదని ఎంవీవీ అన్నారు. కిడ్నాప్‌లో కుట్ర కోణం దాగివుందన్న ఎంపీ, ఇదంతా సినిమా ట్విస్ట్‌లానే అనిపించిందన్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయి ఇబ్బందుల్లో ఉంటే అలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.
మా కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించారు
పోలీసులు తెలియజేసేవరకు తమ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినట్లు తెలియదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి.. కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. మూడు రోజులు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారన్నారు. హేమంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఈ కేసులో ఏ2 గా ఉన్న రాజేశ్‌పై 40కి పైగా కేసులు ఉన్నాయన్నారు.