Visakha Woman Attacked : విశాఖలో దారుణం, నడిరోడ్డుపై మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు!
Visakha Woman Attacked : విశాఖలో అద్దె విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో దంపతులిద్దరూ ఓ మహిళపై దాడి చేశారు. మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Visakha Woman Attacked : విశాఖ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధురవాడలో దంపతులు ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నడిరోడ్డుపై మహిళ జట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన సంచలనం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....మిధిలాపురి వుడా కాలనీ గాంధీవిగ్రహం సెంటర్ వద్ద రెండు బడ్డీలను నాగలక్ష్మి అనే మహిళ నెలవారీ అద్దెకు తీసుకుంది. వీటిలో ఒకదాన్ని మరుపల్లి వెన్నెలకు అద్దెకు ఇచ్చింది. ఈ విషయం అసలు ఓనర్ రమేష్‌కు తెలియడంతో బడ్డీలు ఖాళీ చేయాలని నాగలక్ష్మికి చెప్పాడు.

జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ
ఓనర్ బడ్డీలు ఖాళీ చేయమని నాగలక్ష్మి వెన్నెలకు చెప్పింది. అయితే అద్దె లావాదేవీలు ఉండటంతో వెన్నెల ఖాళీ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో వీరి మధ్య ఈ నెల 24న గొడవ జరిగింది. మాటా మాట పెరిగి ఘర్షణ పడ్డారు. వెన్నెల దంపతులు నాగలక్ష్మిపై దాడికి దిగారు. మహిళ అని చూడకుండా ఆమెను దారుణంగా కొడుతూ... జుట్టుపట్టుకుని రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లారు. బడ్డీల పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరడంతో...ఇద్దరు మహిళల ఫిర్యాదులతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. మహిళపై దాడి సమయంలో స్థానికులు వీడియోలు తీశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పోలీసులు పట్టించుకోవడం లేదు
వెన్నెల దంపతులిద్దరూ తనపై అత్యంత కిరాతకంగా దాడి చేస్తే పోలీసులు తగిన న్యాయం చేయలేదని నాగలక్ష్మి ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, తిరిగి తననే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాంటి విచారణ చేయకుండానే ఇరు వర్గాలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారని వాపోయింది. కేసును రాజీ చేసుకోవాలంటూ లేదంటే హోటల్ సమయం మించి నిర్వహిస్తున్నందుకు తనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని నాగలక్ష్మి వాపోయింది.
నాగలక్ష్మి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ వరకు వెళ్లింది. సీపీ ఆదేశాలతో పోలీసులు వెన్నెల దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.