Vizag to Vja: విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే పలు విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో ఉత్తరాంధ్ర నుంచి రాజధానికి ప్రయాణించే వారికి చిక్కులు తప్పడం లేదు. పలు కారణాలతో విమానయాన సంస్థలు ఇటీవలి కాలంలో విశాఖ నుంచి విజయవాడ వైపు నడిచే సర్వీసుల్ని రద్దు చేస్తున్నాయి.
దీంతో విశాఖపట్నం విమానాల్లో వెళ్లడం కంటే రోడ్డు మార్గంలో ప్రయాణించడం మేలని భావిస్తున్నారు. సిక్స్‌లేన్ జాతీయ రహదారిపై ఆరేడు గంటల్లో విజయవాడ చేరుకోడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు ఎదురైన చేదు అనుభవాన్నీ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
"ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా తన లాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని. మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి అంటూ గంటా శ్రీనివాస రావు పోస్ట్ చేశారు.
పౌర విమాన యాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూటమి తరపున కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. విశాఖ నుంచి రద్దైన సర్వీసులపై కొద్ది రోజులుగా ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గంటా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
సంబంధిత కథనం