Ganta Srinivas Rao Arrest : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు
Ganta Srinivas Rao Arrest : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Ganta Srinivas Rao Arrest : ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజను విశాఖలో అరెస్టు చేశారు. ఎండాడ దిశా పోలీస్ స్టేషన్ లో గంటా శ్రీనివాసరావు దిశా ఏసీపీ వివేకానంద అరెస్టు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గంటా... చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. జగన్ కళ్లలో ఆనందం కోసం చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్న ఆయన.. అలాంటి వ్యక్తిని అర్థరాత్రి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారన్నారు.
ట్రెండింగ్ వార్తలు
అక్రమ కేసులు పెట్టి అరెస్టులు
జగన్ జైలుకు వెళ్లారని... ఆ అక్కసుతోనే చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. అవినీతి కేసుల్లో జగన్ 16 నెలలు జైలు జీవితం గడిపారని, అలాగే అందర్నీ జైలుకు పంపించాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. అమరావతి భూముల వ్యవహారంలో తన పేరును చేర్చిన ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించిందన్నారు. ఈ కేసులో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
చంద్రబాబును జైలులో పెట్టాలనేది జగన్ లక్ష్యం - బాలకృష్ణ
రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి సీఎం ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యమన్నారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నందుకు, చంద్రబాబును 16 నిమిషాలైనా జైలులో పెట్టాలన్నదే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారని బాలకృష్ణ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021లో స్కిల్ డెవలప్‌మెంట్ లో అవినీతి జరిగిందంటూ ఎఫ్ఐఆర్ ఉందని, నిజంగా అవినీతి జరిగే ఉంటే ఇంత వరకు ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని బాలకృష్ణ నిలదీశారు. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే కోర్టు చివాట్లు పెట్టందని గుర్తుచేశారు. 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే... దాంట్లో కుంభకోణం ఎలా జరిగిందని హైకోర్టు ప్రశ్నించిందన్నారు.