Visakha Accident : విశాఖ జిల్లాలో విషాదం, కన్న తండ్రి కళ్లెదుటే మూడేళ్ల చిన్నారి మృతి
Visakha Accident : విశాఖ జిల్లాలో విషాద ఘటన జరిగింది. తండ్రి కళ్లెదుటే మూడేళ్ల కూతురు ప్రాణాలు విడిచింది. తాను దిగిన స్కూల్ బస్సే ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. శనివారం సాయంత్రం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Visakha Accident : విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాను దిగిన స్కూల్ బస్సే ఢీకొని మూడేళ్ల చిన్నారి, కన్న తండ్రి కళ్లెదుటే మృతి చెందింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారిముద్దుగా పెంచుకున్న కూతురు కళ్లముందే మరణించడాన్ని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆ కుటుంబ రోదనలు మిన్నంటాయి.
ఈ విషాద ఘటన శనివారం సాయంత్రం విశాఖపట్నంలోని భీమిలి మండలం మజ్జిపేట గ్రామంలో చోటు చేసుకుంది. మజ్జిపేటకు చెందిన బంటుపల్లి ఆద్య (3) పద్మనాభం మండలంలోని రెడ్డిపల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది. ప్రతి రోజులానే శనివారం సాయంత్రం స్కూల్ నుంచి వస్తోన్న కుమార్తె కోసం గ్రామంలోని రోడ్డుపై బస్సు ఆపే చోట తండ్రి బంటుపల్లి సురేష్ వేచి ఉన్నారు.
స్కూల్ బస్సు చిన్నారి గమ్యస్థానానికి రానేవచ్చింది. ఆ చిన్నారి స్కూల్ బస్సు దిగి రోడ్డుకు అవతలవైపు ఉన్న తండ్రిని చూసి నాన్న అంటూ కేకలు వేస్తూ సంతోషంగా పరుగులు తీసింది. అంతలో ఆమెను దింపిన స్కూల్ బస్సు ముందుకు కదలింది. ఆ చిన్నారిని బలంగా ఢీకొట్టింది. అంతే ఆ చిన్నారి విలవిల్లాడుతూ అక్కడికక్కడే, కన్నతండ్రి కళ్లెదుటే కన్నుమూసింది.
దీంతో అల్లారిముద్దుగా పెచ్చుకున్న తన కుమార్తె మరణం చూసిన తండ్రి విలవిల్లాడాడు. చిన్నారిని పట్టుకొని ఏడ్చాడు. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న తల్లి, కుటుంబ సభ్యులూ ఎప్పుడూ చలాకిగా కనిపించే ఆద్య విగతజీవిలా కనిపించేసరికి కన్నీరు మున్నీరు అయ్యారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి సురేష్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఆద్య రెండో కుమార్తె. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగిన పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు భీమిలి సీఐ డి.రమేష్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం