విశాఖఫట్నంలో సంచలనం రేపిన దోపిడీ కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులు సొంత ఇంటివాళ్లే అని తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సిటీ పోలీసులు వెల్లడించారు. చోరీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.
ఈ కేసు వివరాలు చూస్తే… కంచరపాలెంలో నివాసముంటున్న ధర్మాల ఆనందరెడ్డి జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. అతనికి 24 ఏళ్ల కుమారుడు (కృష్ణకాంత్) ఉన్నాడు. తొందరగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్‌లైన్ ట్రేడింగ్ మొదలు పెట్టాడు. ఇందులో భారీగా నష్టపోయాడు. దీన్నించి బయటపడేందుకు సొంత ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి ఆనందరెడ్డి అక్టోబర్ 4వ తేదీన ఓ శుభకార్యం కోసం హైదరాబాద్ సిటీకి వెళ్లాడు. ఇదే సరైన సమయమని భావించిన కృష్ణకాంత్… స్నేహితులతో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు.
ప్లాన్ లో భాగంగా ఆ మరుసటి రోజే వీరంతా కలిసి ఇంట్లోకి చొరబడ్డారు. అయితే ఇంట్లో ఆనందరెడ్డి తల్లి ఎల్లమ్మ (65) ఉంది. దీంతో ఆమె కాళ్లు చేతులు కట్టేసి ముఖానికి ప్లాస్టర్ వేశారు. ఇంట్లో సోమ్ముని దొంగిలించారు. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును తీసుకెళ్లారు. బయట ఉన్న కారులో నిందితులంతా పరారయ్యారు. అక్కడ్నుంచి ఆర్టీసీ బస్సులో ఎక్కి హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఈ ఘటనపై బాధిత కుటంబం పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టగా.. అసలు విషయాలు బయటికొచ్చాయి. మనువడైన కృష్ణకాంతే… ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి 12 తులాల బంగారం, రూ.2,10,000 నగదును స్వాధీనం చేసుకున్నామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు. ఈ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు కృష్ణకాంత్ కాగా… ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, సత్య స్నేహితులుగా ఉన్నారని చెప్పారు.
సంబంధిత కథనం