Visakha Crime : బాలికపై లైంగిక దాడి కేసు- విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు
Visakha Crime : మానసిక వికలాంగురాలైన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
Visakha Crime : మానసిక వికలాంగురాలైన బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో నిందితులకు జైలు శిక్షతో పాటు రూ.15 వేలు చొప్పున జరిమానా కూడా న్యాయస్థానం విధించింది. 2016లో జరిగిన ఈ ఘటనలో విశాఖపట్నం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది తీర్పు ఇచ్చారు. జరిమానా విధించిన సొమ్మును బాలికకు ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. గాజువాకలోని ఓ కాలనీలో నిందితులు బొజ్జ సత్యనారాయణ, జలసూత్రం వరం నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహితులు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2016 జనవరి 20న మధ్యాహ్నం 1 గంట సమయంలో అమాయకపు బాలిక సమీపంలోని పాఠశాలకు వెళ్లి వస్తుంది. నిందితులిద్దరూ ఆ బాలికపై కన్నేసి, ఎవరూ లేని చోట ఆ బాలిక కోసం దారిలో కాపు కాశారు.
మనుమరాలిని తీసుకురావడానికి బాలిక అమ్మమ్మ ఎస్.లక్ష్మి స్కూల్‌కి వెళ్లింది. అమ్మమ్మతో కలిసి ఆ బాలిక ఇంటికి వెళ్తుంది. ముందు అమ్మమ్మ నడుస్తుంది. అమ్మమ్మ వెనుక బాలిక నడుస్తోంది. అయితే ఇద్దరు నిందితులు బైక్‌పై అతివేగంతో వచ్చి బాలికను అపహరించారు. వెంటనే ఆ బాలికపై లైంగిక దాడికి యత్నించారు. దీంతో అమ్మమ్మ ఎస్.లక్ష్మి గట్టిగా అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. ఆ నిందితులను వెంబడించారు. దీంతో వారు బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. బాధితురాలిని అమ్మమ్మకి అప్పగించారు. అలాగే బైక్‌ను కూడా స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులకు బాలిక అమ్మమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పోక్సో కేసు కూడా నమోదు చేశారు.
అనేక విచారణల తరువాత నేరం రుజువు కావడంతో నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరు రూ.15 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ప్రత్యేక న్యాయమూర్తి జి. ఆనంది తీర్పు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ వాదనలు వినిపించారు. సాక్ష్యాలు, ఆధారాలను సేకరించి కోర్టు వివరించారు. దీంతో నిందితులకు శిక్ష పడింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు