AP TS Covid Deaths : ఏపీ, తెలంగాణలో కరోనా కలకలం, తొలి కోవిడ్ మరణాలు నమోదు!-visakhapatnam news in telugu covid deaths recorded in ap hyderabad corona death note ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Covid Deaths : ఏపీ, తెలంగాణలో కరోనా కలకలం, తొలి కోవిడ్ మరణాలు నమోదు!

AP TS Covid Deaths : ఏపీ, తెలంగాణలో కరోనా కలకలం, తొలి కోవిడ్ మరణాలు నమోదు!

Bandaru Satyaprasad HT Telugu
Dec 26, 2023 03:21 PM IST

AP TS Covid Deaths : ఏపీ, తెలంగాణలో కరోనా మరణాలు నమోదు అయ్యాయి. విశాఖ కేజీహెచ్ లో కరోనా లక్షణాలు ఓ మహిళ మృతి చెందగా, హైదరబాద్ ఉస్మానియాలో ఇద్దరు మరణించారు.

కోవిడ్ కేసులు
కోవిడ్ కేసులు (unsplash)

AP TS Covid Deaths : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో తొలి కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఈ నెల 24న విశాఖ కేజీహెచ్ లో ఓ మహిళ కరోనా లక్షణాలతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 29 యాక్టివ్ కేసులున్నాయి. వీటిల్లో విశాఖలోనే 20 మందికి కోవిడ్ బారిన పడ్డారు. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోవడంతో కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తోందని అధికారులు అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఏపీలో కరోనా మరణంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ బెడ్లు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

yearly horoscope entry point

కరోనా మరణాలు

తెలంగాణలో మళ్లీ కోవిడ్ కలవరం మొదలైంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4170 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. అయితే తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం రికార్డు అయ్యింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌ లక్షణాలతో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు జూనియర్‌ డాక్టర్‌లకు కూడా కోవిడ్ సోకింది. వివిధ అనారోగ్య కారణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు. వీరిని కోవిడ్ పరీక్ష చేయగా... పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

తెలంగాణలో 10 పాజిటివ్ కేసులు

తెలంగాణలో సోమవారం 989 నమూనాలను పరీక్షించగా 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక బులెటిన్‌లో తెలిపింది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ రికవరీల సంఖ్య 8,40,392కి చేరుకుంది. కరోనా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం COVID-19 కేసులు 8,44,558. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న లేదా ఐసోలేషన్‌లో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 55. రాష్ట్రంలో సోమవారం ఎలాంటి కోవిడ్ మరణాలు నమోదు కాలేదని బులెటిన్ తెలిపింది. రాష్ట్రంలో కేసు మరణాల రేటు 0.49 శాతం, కోలుకునే రేటు 99.51 శాతంగా ఉంది. ఆదివారం వరకు దేశంలో మొత్తం 63 COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. గోవాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు సోమవారం తెలిపాయి. అయితే, ఇప్పటివరకు నివేదించిన కేసుల్లో క్లస్టరింగ్ ఏదీ లేదు. JN.1 సబ్‌వేరియంట్‌లోని అన్ని కేసులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు.

Whats_app_banner