Visakha Bus Shelter : నాలుగు రోజులకే కుంగిన రూ.40 లక్షల బస్ షెల్టర్
Visakha Bus Shelter : విశాఖలో ఇటీవల ప్రారంభించిన బస్ షెల్టర్ పక్కకు ఒరిగిపోయింది. రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన బస్ షెల్టర్ కుంగిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Visakha Bus Shelter : విశాఖలో జీవీఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మోడ్రన్ బస్ షెల్టర్ ఒరిగిపోయింది. జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా ఇటీవల నిర్మించిన ఆర్టీసీ బస్ బే కుంగిపోయింది. ప్రమాదం సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బస్ షెల్టర్ ను ఇటీవల జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి ప్రారంభించారు. లక్షలు పోసి నిర్మించిన బస్ బే ఐదు రోజులకే కుంగిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ షెల్టర్ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని సీపీఎం, జనసేన కార్పొరేటర్లు ఆందోళన చేశారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయన్నారు. పనులు నాసిరకంగా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై టీడపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. ప్రచార ఆర్భాటాలు తప్ప నాణ్యమైన పనులు చేయలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రచార ప్రభుత్వం ఇలానే కూలిపోతుందని విమర్శించారు.
ట్రెండింగ్ వార్తలు
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు
జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బల్ షెల్టర్ కుంగిపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 'మీరు కట్టడం అయ్యింది. కూలడం కూడా అయ్యింది జగన్మోహన్ రెడ్డి' అంటూ సెటైర్లు వేశారు. విశాఖ నగరంలో దాదాపు రూ.40 లక్షలు వ్యయంతో నిర్మించిన మోడల్ బస్ షెల్టర్ నాలుగు రోజులకే కుప్పకూలిందని విమర్శించారు. ప్రచారాలకు తప్ప అభివృద్ధికి, నిర్మాణాలకు పనికిరాని ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. రాష్ట్రంలో బస్సులు తిరగడానికి సరైన రోడ్డులు లేవు కానీ, మీ ప్రచార ఆర్భాటాల కోసం ఇలా ప్రజా ధనాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఒక చిన్న బస్ షెల్టర్ ను సక్రమంగా కట్టలేని వాళ్లు, రాజధాని, పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజల ప్రాణాలతో ఆటలా?
"తుమ్మితే ఊడే ముక్కు చందంగా మారిన బస్ షెల్టర్ల కోసం ఆరోజు గ్రీన్‌బెల్ట్‌లోని దశాబ్దాల వయస్సు కలిగిన భారీ వృక్షాలను విచక్షణారహితంగా నరికేసుకుంటూ పోయారు. నగరంలో కొన్నిచోట్ల ఏడాది కిందటే లక్షలాది రూపాయలు వెచ్చించి బస్ షెల్టర్‌లను నిర్మించారు, దృఢంగా ఉన్న ఆ బస్ షెల్టర్లను కూడా పూర్తిగా తొలగించి ఇలాంటి నాసిరకం బస్‌షెల్టర్లు నిర్మించి ప్రజా ధనాన్ని వృధా చేస్తూ... ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు, మీ ప్రచారాల ప్రభుత్వం కూడా కూలిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి" - ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు