Minister Gudivada Amarnath : ఆ భూముల్లో అరసెంటు నా పేరుపై ఉన్నా, రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటా- మంత్రి అమర్ నాథ్-visakhapatnam minister gudivada amarnath sensational comments on chandrababu vissannapeta lands allegation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Visakhapatnam Minister Gudivada Amarnath Sensational Comments On Chandrababu Vissannapeta Lands Allegation

Minister Gudivada Amarnath : ఆ భూముల్లో అరసెంటు నా పేరుపై ఉన్నా, రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటా- మంత్రి అమర్ నాథ్

Bandaru Satyaprasad HT Telugu
May 20, 2023 04:58 PM IST

Minister Gudivada Amarnath : విస్సన్నపేట భూముల్లో ఒక అరసెంటు భూమి తన పేరుపై ఉంటే రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. చంద్రబాబు ఆరోపణలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.

మంత్రి గుడివాడ అమర్ నాథ్
మంత్రి గుడివాడ అమర్ నాథ్ (ANI Twitter)

Minister Gudivada Amarnath : ఎక్స్ పరీ డేట్ కు దగ్గరగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో తనకు సవాల్ ఏంటని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. కానీ విస్సన్నపేట భూములపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. విస్సన్నపేటలోని 609 ఎకరాల్లో ఒక్క అరసెంటు భూమి తన పేరుపై ఉన్నా రాజకీయాలకు స్వస్తిచెబుతానన్నారు. ఈ ఆరోపణలు అవాస్తవం అయితే లోకేశ్ ను రాజకీయాల నుంచి తప్పిస్తారా అంటూ మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. అనకాపల్లి సభలో అమరావతే రాజధాని అని బలవంతంగా చెప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు విశాఖపై ఎంత ద్వేషం ఉందో అనకాపల్లి సభతో అర్థం అవుతుందన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు త్యాగాలు చేస్తే యోగాలు, భోగాలు అనుభవించే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడూ కోరుకోలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా?

విస్సన్నపేట భూములపై చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తున్నానన్న మంత్రి గుడివాడ అమర్ నాథ్... చంద్రబాబు మాదిరిగా, తాను ఎక్కడా భూములు దోచేయలేదన్నారు. చంద్రబాబు కొడుకు, తోడల్లుడు గీతం వర్సిటీ పేరుతో భూములు కబ్జా చేశారని ఆరోపించారు. విస్సన్నపేటలో 609 ఎకరాలు కబ్జా చేసినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారని, కానీ అందులో 49 ఎకరాలు రంగుబోలిగడ్డ రిజర్వాయర్‌ కోసం సేకరించిన చంద్రబాబు, రైతులకు పరిహారం కూడా ఎగ్గొట్టారన్నారు. ఇందులో మిగిలిన 560 ఎకరాల భూమి....89 మంది రైతుల పేరుతో ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఓ జాబితా విడుదల చేశారు. ఈ భూముల్లో కనీసం అర సెంటు భూమి తన పేరుపై లేదా తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. ఈ ఆరోపణలు నిరూపించకపోతే లోకేశ్ ను రాజకీయాల్లోంచి తప్పించాలన్నారు. తప్పు చేయాల్సి వస్తే తన పీక తీసి పక్కన పెట్టుకుంటానే తప్ప, అవినీతికి పాల్పడనన్నారు.

ఒక్క సెంటు భూమి పేదవాడికి ఇచ్చారా?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒక్క పేదవాడికైనా ఒక సెంటు భూమి పంచి పెట్టారా? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల మందికి భూమి పంపిణీ చేసిందని, అంతే కాకుండా ఇంటి నిర్మాణానికి అవసరమైన ఖర్చు కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలను సమాధులుగా మాట్లాడుతున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెప్తారన్నారు. జీవీఎంసీ పరిధిలో 1,50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తమ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తే, చంద్రబాబు కోర్టుకు వెళ్లి దానిని అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తన ప్రభ తగ్గిపోతుందని గమనించి ఎన్టీఆర్ ను మళ్లీ తెర మీదకు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వాళ్లంతా ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహించటం బాధాకరమన్నారు.

IPL_Entry_Point