విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుపై కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో మెట్రో నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాఖ మెట్రో కు సంబంధించి అక్టోబర్ నెలలో పనులు మొదలుపెడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. డబుల్ డెక్కర్ మెట్రో కింద డిపిఅర్ ఇచ్చినట్టు తెలిపారు. కోటి మంది ప్రజానీకం ఉన్న హైదరాబాద్ కు రింగ్ రోడ్డు ఉందని అదే తరహాలో విశాఖలో సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అయ్యేలా పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుందని భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తి అవుతున్నాయని తెలిపారు. మిగిలిన ఆరు రోడ్లు కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకుని నూతన రోడ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు.
టిడ్కో ఇల్లు 2014-2019 మధ్య 7 లక్షల ఇళ్లు ప్రతిపాదించామని, గత ప్రభుత్వం 2 లక్షలు ఇల్లు కూడా పూర్తి చెయ్యలేక పోయిందని మంత్రి చెప్పారు. టిడ్కో ఇల్లు పూర్తి చేయాలి అంటే సుమారు ఏడు వేల కోట్లు కావాలని, ఎంతటి ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారన్నారు. ఈ దసరాకి లబ్ది దారులకు టిడ్కో ఇల్లు అందిస్తామని తెలిపారు.
ప్రతి ఇంటికి మంచి నీరిచ్చేలా 2021 లో అమృత పథకం కోసం కేంద్రం నిధులిస్తే, గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేనందున ఆ నిధులు వెనక్కి వెళ్లి పోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి మళ్ళీ నిధులు వచ్చేలా చేశారని, 834 కోట్ల పనులు అమృత్ పథకం కోసం నిర్దేశించామని చెప్పారు. రాబోయే కొద్దినెలల్లో అమృత్ పథకం ద్వారా సర్ఫేస్ వాటర్ వస్తుందన్నారు.
విఎంఆర్డిఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విఎమ్ఆర్డిఏ అండ్ వి కె పి సి పి ఐ ఆర్ యు డి ఎ- విశాఖపట్నం- కాకినాడ పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ జర్సిడిక్షన్ మ్యాప్, రీ విజిటింగ్ మాస్టర్ ప్లాన్ 2041 సంబంధించి అంశాలు , ఎక్స్టెండెడ్ ఏరియా కీలక అంశాలు, స్టేటస్ ఆఫ్ కె పి సి పి ఐ ఆర్ యు డి ఎ మాస్టర్ ప్లాన్ 2041, ఎంఐజి లేఔట్లు , ప్రతిపాదిత వి.ఎం.ఆర్.డి.ఏ కొత్త లేఔట్స్ అంశాలు, మాస్టర్ ప్లాన్ ప్రయారిటీ రోడ్స్ , తీర ప్రాంత కోత ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, కైలాసగిరి ,ఋషికొండ సమగ్ర అభివృద్ధి , వాల్యూ క్యాప్చర్ ఫైనాన్స్ ద్వారా భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్డు అంశాలపై చర్చించినట్టు మంత్రి తెలిపారు.
సంబంధిత కథనం