Janasena On CS : భూకుంభకోణం నిజం కాదని నిరూపిస్తే, సీఎస్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా- జనసేన నేత మూర్తి యాదవ్-visakhapatnam janasena murthy yadav challenged cs jawahar reddy prove land scam allegations not true ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena On Cs : భూకుంభకోణం నిజం కాదని నిరూపిస్తే, సీఎస్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా- జనసేన నేత మూర్తి యాదవ్

Janasena On CS : భూకుంభకోణం నిజం కాదని నిరూపిస్తే, సీఎస్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా- జనసేన నేత మూర్తి యాదవ్

HT Telugu Desk HT Telugu
May 26, 2024 04:22 PM IST

Janasena On CS Jawahar Reddy : సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఉత్తరాంధ్రలో 800 ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. తన ఆరోపణలు అవాస్తవం అని నిరూపిస్తే సీఎస్ కాళ్లు పడ్డుకుని మీడియా ముందు క్షమాపణ చెబుతానన్నారు.

భూకుంభకోణం నిజం కాదని నిరూపిస్తే, సీఎస్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా- జనసేన నేత మూర్తి యాదవ్
భూకుంభకోణం నిజం కాదని నిరూపిస్తే, సీఎస్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా- జనసేన నేత మూర్తి యాదవ్

Janasena On CS Jawahar Reddy : తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కాళ్లు పట్టుకొని, మీడియా ముందు క్షమాపణ చెబుతానని‌ జనసేన పార్టీ నాయకుడు, జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి కుమారుడు ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు చట్టబద్దంగా తీసుకునే ఎటువంటి చర్యలకైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మే 13, 20 తేదీల్లో విశాఖపట్నం తాను వచ్చానని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారని, మరి మే 9న విశాఖపట్నం నగరానికి ఆయన ఎందుకు వచ్చారని సందేహం వ్యక్తం చేశారు. ఓ వేళ.. స్నేహితుడి ఇంట్లో వివాహానికి వస్తే భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీక్షకు ఎందుకు వెళ్లారని సీఎస్ జవహార్ రెడ్డిని మూర్తి యాదవ్ ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రకే ఎందుకు వచ్చారు?

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం రాష్ట్రంలో 26 జిల్లాలుంటే ఉత్తరాంధ్రకు మాత్రమే మీరు ఎందుకు వచ్చారన్నారు. భోగాపురం పరిసర గ్రామాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ముందుగానే ఇచ్చారని గుర్తు చేశారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలిలలో సుమారు 700 ఎకరాల వరకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జీవో 596 ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సీఎస్ కుమారుడు ఆధ్వర్యంలోనే ఈ భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు. ఈ భూకుంభకోణంలో ముఖ్యంగా ఐఏఎస్‌లు, వైసీపీ నేతలే ఉన్నారని విమర్శించారు. సర్వాధికారాలు కలిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రైతుల వద్ద నుంచి భూమి మారలేదని చెప్పగలరా? ఈ భూములపై జరిగిన రిజిస్ట్రేషన్స్ రద్దు చేయగలరా? అని సీఎస్ జవహర్ రెడ్డికి మూర్తి యాదవ్ ప్రశ్నలు సంధించారు.

సీఎస్ కాళ్లు పట్టుకుంటా

ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సీఎస్‌గా జవహర్ రెడ్డి సర్వాధికారాలు కలిగి ఉన్నారన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదా సీబీఐతో అయినా దర్యాప్తు చేయించగలరా? అని సీఎస్‌ను మూర్తి యాదవ్ ప్రశ్నించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. అందుకు తన వద్ద రుజువులు సైతం ఉన్నాయన్నారు. తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తే.. సీఎస్ జవహార్ రెడ్డి కాళ్లు పట్టుకొని, మీడియా ముందు క్షమాపణ చెబుతానని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. అయితే శనివారం జనసేన నేత మూర్తి యాదవ్ చేసిన భూ కబ్జా ఆరోపణలపై సీఎస్ జవహర్ రెడ్డి స్పందించారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పరువు నష్టం కేసు పెడతానని హెచ్చరించారు. దీనిపై మూర్తి యాదవ్ ఆదివారం స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం