Janasena On CS Jawahar Reddy : ఉత్తరాంధ్ర అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఎస్ జవహర్ రెడ్డి హస్తం - జనసేన నేత మూర్తి యాదవ్-visakhapatnam janasena leader murthy yadav alleged cs jawahar reddy hand in uttarandhra assigned land scam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena On Cs Jawahar Reddy : ఉత్తరాంధ్ర అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఎస్ జవహర్ రెడ్డి హస్తం - జనసేన నేత మూర్తి యాదవ్

Janasena On CS Jawahar Reddy : ఉత్తరాంధ్ర అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఎస్ జవహర్ రెడ్డి హస్తం - జనసేన నేత మూర్తి యాదవ్

Bandaru Satyaprasad HT Telugu
May 25, 2024 07:25 PM IST

Janasena On CS Jawahar Reddy : సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో 800 ఎకరాల అసైన్డ్ భూములను దోచేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేలా అధికారులపై సీఎస్ ఒత్తిడి చేస్తున్నారన్నారు. మార్చి నుంచి జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉత్తరాంధ్ర అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఎస్ హస్తం - జనసేన నేత మూర్తి యాదవ్
ఉత్తరాంధ్ర అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఎస్ హస్తం - జనసేన నేత మూర్తి యాదవ్

Janasena On CS Jawahar Reddy : సీఎస్ జవహర్ రెడ్డిపై భూ దోపిడీ ఆరోపణలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూములు కొట్టేశారన్నారు. జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 తెచ్చారన్నారు. ఆ జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల మార్పిడి జరిగిందని ఆరోపించారు. రోమ్ నగరం తగలబడి పోతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు..ఒక పక్క ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారన్నారు.

yearly horoscope entry point

సమీక్ష పేరుతో మభ్యపెట్టి

అలాగే అక్రమంగా భూముల రిజస్ట్రేషన్ల కోసం నాలుగు రోజుల క్రితం సీఎస్ విశాఖ వచ్చి భోగాపురం సమీక్ష అని మభ్యపెడుతున్నారని పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. జగనన్న పేదల ప్రభుత్వంలో సీఎస్ కు విశాఖలో రెండు వేల కోట్ల భూములు కొట్టేశారని, మిగిలిన చోట్ల ఇంకెంతో అంటూ ప్రశ్నించారు. దేశంలో సివిల్ సర్వేంట్స్ నిర్ఝాంతపోయేలా...రాజకీయ నేతలు షాక్ కు గురయ్యేలా వేల కోట్ల భూకుంభకోణానికి నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్ జవహర్ రెడ్డి తెరలేపారన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రా జిల్లాల్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన, ఎస్సీ, బీసీలకు చెందిన 400 ఎకరాల అసైన్డ్ భూములను కుమారుడిని అడ్డంపెట్టి బినామీల పేరిట చేజిక్కించుకున్నారని ఆరోపించారు. మరో 400 ఎకరాలకు పైగా భూములను ఆఘమేఘాల మీద రిజిస్ర్టేషన్ చేయించేందుకు యుద్ధప్రతిపదికన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.

ఇష్టానుసారం రిజిస్ట్రేషన్లు

"పోలింగ్ అనంతరం రాష్ట్రం హింసతో అట్టుడికిపోతంటే కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో జవహార్ రెడ్డి అవేవీ తనకు పట్టనట్టు విశాఖ వచ్చి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహరాన్ని సమీక్షించి మరింత వేగంగా పనిపూర్తి అయ్యేలా తన అధికారంతో కింది స్ధాయి వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. జీవో 596 ను అడ్డం పెట్టుకొని...సీఎం జగన్ వారిపై కపట ప్రేమను చూపించారు. ఆ సమయంలోనే వారి చేతుల్లో ఉన్న కొద్దిపాటి అసైన్డ్ భూములను భూస్వాములు, రాజకీయనేతలు, అవినీతి అధికారుల పరం చేసే జీవో 596 విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం అసైన్డ్ భూములను వారి వారసులకు, అనుభవదారులకు ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ జారీ చేసి భూమిపై సర్వ హక్కులు కల్పించారు. అంటే సర్టిఫికేట్ జారీ అయితే భూములను 22ఏ నుంచి తప్పిస్తారు. ఈ మేరకు సెక్షన్ 35 ఆఫ్ 2023 పేరిట చట్టం చేశారు. దీంతో ఇస్టానుసారంగా అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. దీనినే ఆసరగా చేసుకుని జీవో రాకముందే జవహార్ రెడ్డి అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్న విశాఖ, విజయనగరం జిల్లాలపై కన్ను వేసి కుమారుడిని రంగంలోకి దింపారు. ఆయన ఒక ముఠాను రంగంలోకి దింపి బెదిరించి, భయపెట్టి తక్కవకు ఐదు, పది లక్షల రూపాయలకే ఎకరా చొప్పున కొన్ని వందల ఎకరాలకు అగ్రిమెంట్లు చేసుకొన్నారు"- పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్

కోట్ల విలువై భూములను కేవలం లక్షలకే

బహిరంగ మార్కెట్ లో ఎకరా రెండు కోట్లకు పైగా ఉన్న చోట కూడా ఎకరా ఐదారు లక్షలకే జవహార్ రెడ్డి తనయుడు ఒప్పందాలు చేసుకొని అడ్వాన్సులు ముట్టజెప్పారని పీతల మూర్తి యాదవ్ ఆరోపిచారు. వైసీపీ ప్రభుత్వం రాదన్న భయంతో హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారన్నారు. పోలింగ్ వరకూ ఈ భూముల గురించి పెద్దగా పట్టించుకోని జవహార్ రెడ్డి సంబంధీకులు సీఎం జగన్ విదేశీ పర్యటకు వెళ్లగానే మరే ఏ పని లేనట్టు పూర్తిగా రిజిస్ట్రేషన్ల పైనే ఉన్నారన్నారు. కౌంటింగ్ కు వారం రోజుల ముందే ఈ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిచేసేందుకు విశాఖ , విజయనగరం అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి అర్ధరాత్రి వరకూ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తిరిగి రాకపోతే తనను వెంటనే పదవిలో నుంచి తప్పించే ప్రమాదం ఉందని గ్రహించిన జవహార్ రెడ్డి రాష్ట్ర పాలనను పక్కన పెట్టి అమరావతి నుంచి ఈ వ్యవహారాలను సమీక్షించడం మీదే సమయం వెచ్చిస్తున్నారన్నారు.

అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ వందల ఎకరాల్లో ఉన్న అసైన్డ్ భూములపై జవహార్ రెడ్డి కన్నేశారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విమానాశ్రయం ఏడాదిలో పూర్తి అవుతుండడంతో ఆ చుట్టు పక్కల భూములకు మంచి డిమాండ్ ఉంటుందన్న భావనతో వాటిని చేజిక్కించుకొన్నారన్నారు. భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న విజయనగరం జిల్లా పరిధిలో పూసపాటిరేగ, డెంకాడ, నాతవలసలలో పెద్ద సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. వీటితో పాటు విశాఖ జిల్లా పరిధిలోని అత్యంత విలువైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో వందలాది ఎకరాలను జవహార్ రెడ్డి టీం చేజిక్కించుకుందని తీవ్ర విమర్శలు చేశారు. గుడిలోవ,గండిగుండం, తర్లువాడ,గిరజాల,రామవరం,రావాడ, రావివలస, ముక్కాం, సవరవల్లి, తూడెం, బీటీ కల్లాలు, భీమ దొరపాలెం, ఐనాడ కనమాం తదితర గ్రామాల్లో జవహార్ రెడ్డి ఒత్తిడితో వందల ఎకరాలు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయన్నారు.

వైసీపీ నేతలు ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున, సీఎం సతీమణి వైఎస్ భారతి పేరిట ఈ ప్రాంతాల్లో భూములను చేజిక్కిచుంకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ముఠాలను తాజాగా జవహార్ రెడ్డి గ్యాంగ్ డామినేట్ చేసిందన్నారు. వీరు అడ్వాన్సులు ఇచ్చిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చకచకా జరిగిపోతున్నాయన్నారు. విజయసాయి రెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున నుంచి జవహార్ రెడ్డి వరకూ ఎంతో మంది అధికార పెత్తనంతో దళితులను, బీసీలను భయపెట్టి భూములు కాజేశారన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని అక్రమంగా, అన్యాయంగా జరుగుతున్న అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని కోరారు. మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసిన వైసీపీ నేతలు, ఐఏఎస్ లపై సీబీఐ విచారణ జరపాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.

సీఎస్ ఏమన్నారంటే?

తనపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన భూముల కొనుగోలు ఆరోపణలను సీఎస్ జవహర్ రెడ్డి ఖండించారు. విశాఖలో తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ భూములు లేవని తెలిపారు. విశాఖ పర్యటనలో తన మిత్రుడి ఇంటికి వెళ్లాలన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు పనులపై సమీక్షించానన్నారు. గత కొంత కాలంగా కొందరు తనపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని సీఎస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అతనిపై పరువు నష్టం దావా వేస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Whats_app_banner