Pregnant Woman Murder : మరో 24 గంటల్లో ప్రసవం, నిండు గర్భిణీని గొంతు నులిమి హత్య చేసిన భర్త-visakhapatnam husband strangles pregnant woman to death she gives birth in 24 hours ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pregnant Woman Murder : మరో 24 గంటల్లో ప్రసవం, నిండు గర్భిణీని గొంతు నులిమి హత్య చేసిన భర్త

Pregnant Woman Murder : మరో 24 గంటల్లో ప్రసవం, నిండు గర్భిణీని గొంతు నులిమి హత్య చేసిన భర్త

Pregnant Woman Murder : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ కిరాతక భర్త నిండు గర్భిణీని గొంతు నులిమి హత్య చేశాడు. మరో 24 గంటల్లో ఓ బిడ్డకు జీవం పోయాల్సిన యువతి జీవశ్చవంలా మారింది.

మరో 24 గంటల్లో ప్రసవం, నిండు గర్భిణీని గొంతు నులిమి హత్య చేసిన భర్త

Pregnant Woman Murder : మరో 24 గంటల్లో ప్రసవం, పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆ యువతి విగతజీవిగా మారింది. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా భర్త రూపంలో ఉన్న మృగాడు అతిదారుణంగా ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ మధురవాడలో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది?

విశాఖ పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న గెద్దాడ జ్ఞానేశ్వరరావు, అనూష రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఒంటరిగా మధురవాడ పీఎంపాలెంలోని ఊడా కాలనీలో నివాసం ఉంటున్నారు. స్కౌట్స్, సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద జ్ఞానేశ్వర్ రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని వైద్యులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. సోమవారం ఉదయం వీరి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ఘర్షణకు దారి తీయడంతో గర్భిణీ అనే విషయం మరిచి భార్యపై దాడి చేశాడు జ్ఞానేశ్వరరావు. ఆమెను గొంతు నులిమి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి అనూషకు ఆరోగ్యం బాగోలేదని వెంటనే రావాలని కోరాడు. దీంతో వారందరూ అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల విచారణలో

అనూషను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్థారించారు. దీంతో అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ విషయం అనూష తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆస్పత్రి వద్దకు వచ్చి బోరున విలపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అనూషను తానే గొంతు నులిమి హత్య చేసినట్లు జ్ఞానేశ్వరరావు నిజం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో 24 గంటల్లో ఓ బిడ్డకు జన్మనివ్వాల్సిన తమ కూతురు జీవశ్చవరంగా మారిపోవడాన్ని చూసి అనూష తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.

గతంలోనూ హత్యాయత్నం

"జ్ఞానేశ్వరరావు ఇంట్లో తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. భార్యను బయటకు ఎక్కడికి తీసుకువెళ్లినా, ఆమెతో సరదాగా మెలిగేవాడు కాదు. జంటగా ఫొటోలు దిగుదామంచే వద్దనేవాడు. గతంలో కూడా పలుమార్లు అనూషపై హత్యాయత్నం చేశాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ప్రయత్నించాడు. ఇవాళ మేము అతడి ఇంటికి వెళ్లి చూసే సరికి బెడ్ మీద స్పృహ లేకుండా పడిఉంది. ఈరోజు డెలివరీ ఉందని నిన్న ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ లో మాట్లాడింది. చున్నీతో గొంతు బిగించి చంపేశాడు. భర్త జ్ఞానేశ్వరరావు ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు కూడా ఉన్నాయి" అని అనూష స్నేహితులు ఒకరు తెలిపారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం