Menstrual Holiday : నెలలో ఒక రోజు నెలసరి సెలవు, దామోదరం సంజీవయ్య లా వర్సిటీ కీలక నిర్ణయం
Menstrual Holiday : విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య లా వర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వాలని నిర్ణయించింది.
Menstrual Holiday : రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్ఎల్‌యూ) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ విద్యాసంస్థ తీసుకోని ఒక కీలకమైన నిర్ణయం డీఎస్ఎన్ఎల్‌యూ తీసుకుంది. విద్యార్థినులకు నెలసరి సెలవును ప్రకటించింది. నెలలో ఒక రోజు నెలసరి సెలవు విద్యార్థినులకు ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థినులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
నెలసరి సెలవు తీసుకోవాలనుకునే విద్యార్థినులు కేవలం మెయిల్ చేసి ఈ ప్రత్యేక సెలవును తీసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు యూనివర్సిటీ పరిపాలన విభాగం తెలిపింది. నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.
నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీలకు వెళ్లడం లేదు. ఎందుకంటే ఆ సమయాల్లో విద్యార్థినులు తీవ్రమైన నొప్పి, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కాలేజీలకు వెళ్లడం సాధ్యం కాని పని. దీంతో ప్రత్యేక సెలవుకావాలంటే మెడికల్ సర్టిఫికేట్ కాలేజీకి సమర్పించాలి. ఇది చాలా ఇబ్బందితో కూడుకున్న పని. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ విద్యార్థినులు ప్రత్యేక సెలవు కోరుతూ గత విద్యా సంవత్సరంలోనే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ముందు ప్రతిపాదన పెట్టారు. దీనిని 2024 జనవరిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
కేరళ, బీహార్‌ల్లో మొదటిసారి నెలసరి సెలవులు
దేశంలో చాలా రాష్ట్రాల్లో విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతోన్నాయి. కేరళలోని ఇప్పటికే నెలసరి సెలవులు అమలు అవుతున్నాయి. నెలకు మూడు రోజులు పాటు విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. బీహార్‌లో రెండు రోజుల సెలవులు ప్రకటించింది. 1992 నుంచి ఈ విధానం అమలు చేసింది. దీంతో ఇదే తరహాలో మిగిలిన రాష్ట్రాల్లోనూ మహిళలు, విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. అలాగే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి దీనిపై ఫ్రేమ్‌వర్క్ రూపొందించాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది.
దేశంలో ఏడు లా యూనివర్సిటీల్లో అమలు
ఇప్పటికే దేశంలోని ఏడు లా యూనివర్సిటీల్లో ఇప్పటికే ఈ విధానం అమలు అవుతోంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో నల్సార్ లా యూనివర్సిటీ, చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, మహారాష్ట్రలోని ముంబయి, ఔరంగాబాద్‌ల్లోని ఉన్న మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, జబల్‌పూర్‌లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ, అస్సాంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జూడిషియల్ అకాడమీల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు తాజాగా ఏపీలోని విశాఖపట్నంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ కూడా విద్యార్థినులకు నెలసరి సెలవును అమలుచేస్తోంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం