Visakha Fire Accident : లోకల్ బాయ్ నాని పనేనా? క్రికెట్ బెట్టింగ్ గొడవలా?- విశాఖ హార్బర్ ప్రమాదానికి అసలు కారణమేంటి?
Visakha Harbour Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పార్టీనా లేక క్రికెట్ బెట్టింగ్ ముఠాలా? లేక బోటు కొనుగోలులో జరిగిన గొడవలా? ఇలా పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Visakha Harbour Fire Accident : విశాఖపట్నం హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 బోట్లు కాలి బూడిదయ్యాయి. అయితే అగ్ని ప్రమాదానికి అసలు కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి ముందుగా యూట్యూబర్ నాని కారణం కావొచ్చని ఆ కోణంలో విచారణ చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్, గొడవల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నారన్న కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో నాని బోటు కూడా కాలిపోయిందని సమాచారం. ఆదివారం రాత్రి ప్రమాదం జరగడానికి ముందు లోకల్ బాయ్ నాని తన బోటులో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన భార్య సీమంతం అనంతరం స్నేహితులకు నాని బోటులో పార్టీ ఇచ్చాడని సమాచారం. ఈ పార్టీలో గొడవ జరిగిందని, ఆ కారణంగానే బోటుకు నిప్పుపెట్టారని, మంటలు ఇతర బోట్లకు వ్యాపించాయని పోలీసులు అనుమానించారు. దీంతో పాటు ఓ బోటు అమ్మకం విషయంలో జరిగిన గొడవ కారణంగా నిప్పు పెట్టారని మరో వాదన వినిపిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
లోకల్ బాయ్ నాని చుట్టూ?
హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే నాని వీడియో షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాడు. ఆ వీడియాలో ప్రమాదం ఎలా జరిగిందో తెలియడంలేదని, ప్రమాదం సమయంలో తాను అక్కడ లేనని చెప్పాడు. అయితే ప్రమాద సమయంలో నాని అక్కడ లేకపోతే వీడియో తీసి ఎలా యూట్యూబ్‌లో ఎలా పెట్టాడనే సందేహం తలెత్తుతుంది. ఈ కోణంలో పోలీసులు యూట్యూబర్ నాని విచారించారు. ఆదివారం రాత్రి 11.15 గంటలకు అగ్ని ప్రమాదం జరగగా, నాని 11.45 గంటలకు హర్బర్ కు వచ్చినట్లు మొబైల్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. తన బోటు కాలిపోతుందన్న సమాచారంతో హార్బర్ కు వచ్చానని నాని పోలీసులకు తెలిపాడు. ప్రమాదానికి ముందు నాని ఎక్కుడున్నాడు, మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠాల పనేనా?
ఇంతలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ గొడవల కారణంగా ఈ ఘటన జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు నిందితులు ఎవరో త్వరలోనే తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.
పరిహారం ప్రకటన
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. దాదాపు 80 శాతం సాయాన్ని నష్టపోయిన వారి కుటుంబాలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి బాధితులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. హార్బర్ అగ్ని ప్రమాద బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించారు. బాధితులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. త్వరలో బాధితులను కలిసి స్వయంగా పరిహారం చెల్లిస్తానని చెప్పారు.